
నిజామాబాద్‌నాగారం: దీర్ఘకాలిక రోగాలు ఆయుర్వేదంతో నయమవుతుండడం, ప్రజల్లో డిమాండ్ పెరగడం జిల్లాలో ఆయుర్వేద ఆస్పత్రి ఏర్పాటు ప్రాధాన్యతను తెలుపుతున్నది. పక్షవాతం, కీళ్లసంబంధిత వ్యాధులు, డిస్క్ డిజార్డర్స్, సర్వైకల్, స్త్రీ సంబంధిత వ్యాధులు, ఇన్‌ఫర్టిలిటి, పిల్లల్లో వచ్చే డెవలప్‌మెంట్ డిజార్డర్స్, పైల్స్, ఫిస్టులా, చర్మసంబంధిత వ్యాధులు తదితర వాటికి ఆయుర్వేదంతో చక్కని ఫలితాలున్నాయి. దీంతో జిల్లాలో ఆయుర్వేదానికి డిమాండ్ పెరుగుతున్నది. అయితే రోగులకు కేవలం అవుట్‌పేషెంట్ సేవలు మాత్రమే అందుతున్నాయి. ఇన్‌పేషెంట్ సేవలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 17 ఆయుర్వేద ఆస్పత్రుల్లో అవుట్‌పేషెంట్ సేవలు అందుతుండగా, ఒక్కో ఆస్పత్రిలో ప్రతిరోజూ 30మంది వరకు రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారుసైతం మందులు తీసుకొని వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇన్‌పేషెంట్ సేవల కోసం వరంగల్, హైదరాబాద్‌లోని ఆయుర్వేద ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. నిర్మల్, నిజామాబాద్‌జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఆయుర్వేద ఆస్పత్రిని గతంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులు సిద్దిపేటలో ఏర్పాటు చేయించారు.
జిల్లాలో అత్యవసరం
నిజామాబాద్‌జిల్లాలో ఆయుర్వేద ఆస్పత్రి ఏర్పాటు అత్యవసరం. రైలు సౌకర్యం ఉండడంతో జిల్లాకు సరిహద్దులో ఉండే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు సైతం ఆయుర్వేద వైద్యం కోసం జిల్లాకు వస్తున్నారు. ఆయుర్వేద వైద్యం కోసం 50 పడకల ఆస్పత్రిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో ఆయుర్వేదానికి
పెరుగుతున్న ఆదరణ
ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వినతులు