
వీసీలో పాల్గొన్న కలెక్టర్, సీపీ, అధికారులు
సుభాష్‌నగర్: ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో అక్టోబర్ 3న నిర్వహించనున్న పలుకార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ యాదవ్‌తో కలిసి శాంతికుమారి శుక్రవారం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించామని సీఎస్‌కు తెలిపారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. లోటుపాట్లకు తావివ్వొద్దని, హెలీపాడ్, కాన్వాయ్, సెక్యూరిటీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
గిరిరాజ్ కళాశాల మైదానం పరిశీలన
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించనున్న జీజీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శుక్రవారం పలుమార్లు పరిశీలించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సత్యనారాయణతోపాటు ఎస్‌పీజీ అధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్‌ను ఎస్‌పీజీ అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రధాని మోదీ సభ నేపథ్యంలో
సీఎస్ శాంతికుమారి
వీసీలో అధికారులకు సూచన