
● ఒలింపిక్‌లో బెర్త్..
● జిల్లా నుంచి మొట్టమొదటి
క్రీడాకారిణిగా రికార్డు
● ఆసియా క్రీడల్లో సెమీస్‌కు
చేరడంతో పతకం ఖాయం
నిజామాబాద్‌నాగారం: పవర్ పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ.. తనదైన శైలిలో దూసుకెళ్తున్న నిఖత్ జరీన్ ఒలింపిక్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. జిల్లా నుంచి మొట్ట మొదటి క్రీడాకారిణిగా నిఖత్ ఒలింపిక్‌లో ఆడనుంది. చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జోడేన్‌కు చెందిన క్రీడాకారిణిని 5–0 తేడాతో చిత్తు చేసింది. దీంతో సెమిస్‌కు చేరడంతో పతకం ఖాయం చేసుకుంది. అక్టోబర్ 1న సెమిస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణితో తలపడనుంది. ఇదివరకే థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణిని ఓడించిన నిఖత్ మరింత ఉత్సాహంతో రింగ్‌లోకి దిగనుంది. జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణిస్తుంది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సైతం బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్‌లో ఆడాలని గత నాలుగేళ్లుగా కృషి చేస్తున్నా అవకాశాలు రాలేదు. అయినా మొక్కవోని దీక్షతో కఠోరంగా శ్రమిస్తూనే ఉంది. గతంలో 52 కేజీల విభాగంలో నిఖత్ రాణించినా, ఒలింపిక్ వెళ్లాలన్న లక్ష్యంతో తన వెయిట్‌లాస్‌ను కూడా తగ్గించుకొని 50 కేజీల విభాగంలో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. ఒలింపిక్‌కు అర్హత సాధించిన క్రీడాకారిణిగా నిఖత్‌కు పలువురు క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.