లక్ష్మణచాంద: వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసి, రైతులకు లాభదాయకంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రైతు వేదికలో అధికారులు, రైతులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూ చించారు. ఆరుతడి, ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా విజయాలు సాధించిన ఆదర్శ రైతులను సన్మానించారు. సోన్ రైతువేదిక నుంచి కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొని మాట్లాడారు. రైతు నేస్తం కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన రైతులు, వ్యవసాయ అధికారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి బీవీ రమణ, తహసీల్దార్ సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


