● అంగన్‌వాడీల్లో అందని పోషకాహారం
లక్ష్మణచాంద: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందిస్తోంది. కేంద్రాలను మరింత పటిష్టం చేయడం, చిన్నారుల్లోని పోషకాహార లోపాన్ని నివారించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘తొలిముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఈ పథకం అమలు చేస్తామని మార్చిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఉదయమే పోషక విలువలతో కూడిన అల్పాహారం అందిస్తే నిరుపేద కుటుంబాల చిన్నారులకు మేలు జరుగుతుందని అంతా భావించారు. కానీ, నెల గడిచినా తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం కాలేదు.
జిల్లాలో 931 కేంద్రాలు
జిల్లాలో 400 గ్రామపంచాయతీల పరిధిలో నాలు గు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఇందులో 931 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వీటి పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 18,891 మంది ఉన్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, కందిపప్పు, బియ్యం, బాలామృతం, మురుకులు తదితర పోషకాహారాన్ని అందజేస్తున్నారు. ఈ పోషకాహారం ఒక్క పూటే అందిస్తుండడంతో చాలామంది చిన్నారుల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది. దీంతో చిన్నారుల్లో వయస్సుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదు. శారీరక, మానసిక ఎదుగుదల లేదు. ఆరేళ్లలోపు చిన్నారులకు తొలిముద్ద పథకం ద్వారా పోషకాహారం, అల్పాహారం అందించడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మేలు జరుగుతుందని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే తొలిముద్ద పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
ఎలాంటి ఆదేశాలు రాలేదు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం అల్పాహారం అందజేసే పథకం తొలిముద్దపై ఇప్పటివరకు ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎ లాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే తొలిముద్దను అమలు చేస్తాం.
– వినూత్న, డీడబ్ల్యూవో, నిర్మల్


