నిర్మల్‌ఖిల్లా: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దుకు చేపట్టిన జన జాగరణ యాత్ర’ గురువారం రాత్రి జిల్లాకేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా సిటీ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు ఇన్‌చార్జికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు సీఎంకు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, వెంకటేశ్, చంద్రకాంత్, అంజన్న, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం భూమన్న, ఆయా సంఘాల నాయకులు రామారావు, రేవంత్, రవిబాబు, సత్యనారాయణ, దేవేందర్, భూమన్న యాదవ్, లక్ష్మణ్, స్వామి, సురేశ్‌చంద్రగౌడ్ తదితరులున్నారు.


