పోషకాహార లోపం అధిగమిద్దాం | - | Sakshi
Sakshi News home page

పోషకాహార లోపం అధిగమిద్దాం

Jul 19 2026 11:27 PM | Updated on Jul 19 2026 11:27 PM

● చిన్నారుల వయసు, బరువుపై ప్రత్యేక దృష్టి ● అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు తూకం ● సంపూర్ణ ఆరోగ్యం దిశగా చర్యలు

లోకేశ్వరం: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పేద పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, పోషకాహార లోపాలను అధిగమించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీల బలోపేతం, చి న్నారుల ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధ చూపుతోంది. చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం చాలా అవసరం. ఎదుగుతున్న పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే సమతుల్య ఆహారం కీలకం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాహారాలను అందిస్తున్నారు.

జిల్లాలో పోషకాహార లోపం..

జిల్లాలో ముధోల్‌, భైంసా, ఖానాపూర్‌, నిర్మల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 931 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 0 నుంచి 6 ఏళ్లలోపు 49,081 చిన్నారులు ఉన్నారు. వీరిలో తీవ్ర పోషకాహార లోపంతో 101 మంది, మితమైన పోషకాహార లోపంతో 1,404 మంది బాధపడుతున్నారు. మొత్తం 1,505 చిన్నారుల్లో పోషకాహార లోపం ఉంది. వీరందరికీ పోషణ లోప సమస్యలను దూరం చేయడానికి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు.

నెలవారీ పర్యవేక్షణ..

ప్రతీనెల అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల బరువు, ఎత్తులను అంగన్‌వాడీ టీచర్లు నమోదు చేస్తారు. ఈ వివరాలను ఎన్‌హెచ్‌ఎం యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దీని ఆధారంగా పిల్లల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని అధికారులు చర్యలు తీసుకుంటారు. తక్కువ లేదా తీవ్ర పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి బాలామృతం ప్లస్‌ అందించడం, ఒక గుడ్డుకు బదులుగా రెండు గుడ్లు అందించడం వంటి చర్యలు తీసుకుంటారు. మరింత అనారోగ్య సమస్యలు ఉంటే చిన్నారి తల్లిదండ్రులతో కలిసి అంగన్‌వాడీ టీచర్‌ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయిస్తారు.

పోషకాహార లోపంతో నష్టాలు..

చిన్నారుల్లో వయస్సుకు తగ్గ బరువు, ఎదుగుదల తగ్గడం వల్ల తీవ్ర నష్టాలు కలుగుతాయి. పోషకాహారం అందుబాటులో లేకపోవడం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం దెబ్బతినడం వారి పెరుగుదలను దెబ్బతీస్తుంది. తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. మెదడు అభివృద్ధి, జ్ఞానాత్మక నైపుణ్యాలపై ప్రభావం పడుతుంది. ఇది అభ్యసన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement