ఆదిలాబాద్‌టౌన్: గోరుతో పోయేది.. గొడ్డలితోదాక అన్న సామెత ఇక్కడ అ చ్చంగా వర్తిస్తుంది. కిడ్నీలో ఉన్నరాళ్లు తీయకపోవడంతో ఏకంగా కిడ్నీనే తొలగించే పరిస్థితి ఏర్పడింది. రిమ్స్ యూరాలజీ వైద్యుడు కార్తీక్ అరుదైన శస్త్రచికిత్స చేసి కిడ్నీలో ఉన్న రాయిని, చెడిపోయిన కిడ్నీ తొలగించి ఓ నిండుప్రాణాన్ని కా పాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మాలే బోరిగాం గ్రామానికి చెందిన గిరిజన మహిళ సెడ్మకి దేవుబాయి(35) ఏడాదిగా కడుపు నొప్పితో బాధపడుతుంది. ఈనెల 8న సమీప బంధువు సహాయంతో రిమ్స్‌లో చేరింది. వైద్యుడు కార్తీక్ ఆమెను పరీక్షించి మూత్రపిండంలో పెద్దసైజు గల రాయి (స్టోన్) ఉందని నిర్ధారించారు. ఈనెల 17న శస్త్రచికిత్స చేయగా 9x10x9 పెద్ద సైజులో ఉన్న రాయి తొలగించారు. కొన్ని నెలలుగా మూత్రపిండంలో ఉన్న రాయి.. మూత్రం బయటకు రాకుండా అడ్డుగా ఉండడంతో దానిపై ప్రభావం పడి ఒక కిడ్నీ చెడిపోయిందని వైద్యుడు తెలిపారు. సదరు వైద్యుడిని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అభినందించారు.


