భైంసా: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 70 వేల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో మొలకలు బాగా వచ్చాయి. పంటకు ప్రస్తుతం సుమారు 24 రోజుల వయసు వచ్చింది. ఈ దశలో అత్యంత కీలకమైన పని కలుపు నియంత్రణ. వర్షాలు లేక కలుపు మందు పిచికారీ చేయడం లేదు. దీంతో పంట, కలుపు పోటీపడి పెరుగుతున్నాయి.
ఆగిన గడ్డి మందు స్ప్రే..
20 రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పొలాల్లో తేమ తగ్గిపోయింది. ఫలితంగా రైతులు గడ్డి మందు(కలుపు మందు) పిచికారీ చేయలేక ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా సోయాబీన్ మొలకలు వచ్చిన మూడు వారాల్లో ఎంపిక చేసిన గడ్డి మందులను పిచికారీ చేస్తారు. ఈ మందులు సమర్థవంతంగా పని చేయాలంటే పొలంలో తగినంత తేమ ఉండాలి. ప్రస్తుతం వర్షాలు లేక నేల పొడిగా మారింది. ఈ పరిస్థితుల్లో గడ్డి మందు పిచికారీ చేసినా ఆశించిన ఫలితం రాదని రైతులు, వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
వర్షాలు కురిస్తేనే పిచికారీ..
ప్రస్తుతం రైతులు గడ్డి మందు కొనుగోలు చేసినా, పిచికారీ చేయడానికి వెనుకాడుతున్నారు. ముందుగా వర్షం కురిసి నేలలో తేమ పెరిగిన తర్వాతే మందు పిచికారీ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఆలస్యం అయిన కొద్దీ కలుపు మొక్కలు బలపడి వాటిని నియంత్రించడం మరింత కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలుపు పెరుగుతోంది
నేను ఈఖరీఫ్‌లో సోయా వేసిన . మొలకలు వచ్చి 24 రోజులు అయింది. ఈ సమయంలో గడ్డి మందు పిచికారీ చేయాలి. వర్షాలు లేక పొలం పూర్తిగా పొడిగా మారింది. ఇప్పుడు మందు కొడితే పనిచేయ దు. గడ్డి చావదు. పంటను మించి కలుపు వేగంగా పె రుగుతోంది. రెండు మూడు రోజుల్లో వర్షం పడితేనే పంటను కాపాడుకోగలం. లేకపోతే దిగుబడిపై ప్రభావం పడుతుంది.
– శంకర్, వాలేగాం, రైతు
ఏపుగా కలుపు..
ఒకవైపు సోయాబీన్ మొక్కలు పెరుగుతుండగా, మరోవైపు కలుపు మొక్కలు వేగంగా విస్తరిస్తున్నాయి. సోయాబీన్ మొక్కలకు అవసరమైన తేమ, పోషకాలు, సూర్యరశ్మిని కలుపు మొక్కలే ఎక్కువగా తీసుకుంటున్నాయి. దీంతో పంట ఎదుగుదల మందగించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మంచి వర్షాలు కురవకపోతే కలుపు మరింతగా పెరిగి దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.


