కడెం: ప్రభుత్వ ఉచిత విద్య, వైద్యం అందరికీ అందాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీని మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ, ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలన్నారు. వసతి గృహాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు క్విజ్ నిర్వహించి, విద్యార్థులకు పెన్నులు బహుమతులుగా ఇచ్చారు. ఆస్పత్రికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చికిత్స అందించాలని తెలిపారు. అనంతరం ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీఈవో భోజన్న, డీఎంహెచ్‌వో రాజేందర్, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో అరుణ, ఎస్‌వో విమల, డాక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై సంబంధిత అధికా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ బోధన చేయాలన్నారు. ప్రతీ రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉపాధ్యాయులు కచ్చితంగా ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేయాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేయడానికి వారాలు, నెల వారీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత విద్యార్థులు సబ్జెక్టులు చదువుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో భోజన్న పాల్గొన్నారు.


