ఉపాధిహామీ.. వసతుల లేమి? | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ.. వసతుల లేమి?

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

● జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు ● పని స్థలాల్లో నీడ, తాగునీరు కరువు ● ఎండలకు విలవిల్లాడుతున్న కూలీలు ● పనులకు వెళ్లేందుకు జంకుతున్న వైనం

తానూరు: మండుటెండల్లో ఉపాధిహామీ కూలీలు విలవిల్లాడుతున్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధిహామీ కూలీలకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు పనులకు వెళ్లకపోతే పూట గడవని దుస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలు పనులకు వెళ్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, పని ప్రదేశంలో వారికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. తాగడానికి గుక్కెడు నీరు, సేద తీరడానికి నిలువ నీడ లేక ఎండలకు మలమల మాడిపోతున్నారు.

గతంలో వడదెబ్బతో పలువురు మృతి

ఎండకు తట్టుకోలేక గతంలో పలువురు ఉపాధిహామీ కూలీలు మృతి చెందారు. తానూరు మండలంలోని ఉమ్రి(కే) గ్రామానికి చెందిన సంతురాం, తానూరుకు చెందిన సరస్వతి వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. పని అడిగిన వారంలోపు జాబ్‌కార్డులు జారీ చేసి పని కల్పిస్తున్నామంటున్న అధికారులు వారికి వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. దీంతో ఇప్పటికే కొందరు కూలీలు ఎండ భయానికి పనులకు దూరమవుతున్న పరిస్థితి ఉంది.

ఎండలకు తోడు ఎఫ్‌ఆర్‌ఎస్‌ గండం!

జిల్లాలో 18 మండలాల్లోని 400 గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 1.24 లక్షలు జాబ్‌కార్డులుండగా 2.10 లక్షల మంది కూలీ లు నమోదై ఉన్నారు. ఇందులో 74,682 మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. ప్రభుత్వం కూలీల కు రెండుపూటలా ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదు చేస్తోంది. పని ప్రదేశంలో ఉదయం ఫొటో తీసుకున్న 4గంటల తర్వాత రెండోసారి ఫొటో తీసుకోవడంతో చాలామంది పనులకు వెళ్లడం లేదు. ఎండాకాలం కావడంతో పనులు పూర్తి చేసినా గంటల తరబడి ఫొటో కోసం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎండలు తగ్గే వరకు ప్రభుత్వం ఉదయం ఒక్కసారే ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు తీసుకునేలా చూడాలని కోరుతున్నారు.

వసతుల కల్పనకు చర్యలు చేపడతాం

ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు సూచించాం. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు, నీడ కోసం టెంట్లు సమకూర్చాలి. మరోసారి సిబ్బందితో సమావేశం నిర్వహించి పని ప్రదేశాల్లో తప్పనిసరిగా కూలీకలు సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతాం. – నాగవర్ధన్‌, ఏపీడీ

Advertisement
 
Advertisement
Advertisement