కూలీలు పని చేసే చోట నీడ కోసం టెంట్లు వేయాల్సి ఉండగా ప్రస్తుతం ఎక్కడా ఆ పరిస్థి తి కనిపించడంలేదు. పని ప్రదేశంలో చెట్టు ఉంటేనే వారికి నీడ. లేదంటే మండుటెండలో మగ్గిపోవాల్సిందే. చాలాచోట్ల ఇంటి నుంచి దుప్పట్లు తీసుకువెళ్లి పని చేసే చోట చెట్ల కొమ్మలకు కట్టి నీడ ఏర్పాటు చేసుకుంటున్నారు. అప్పట్లో పంచాయతీల వారీగా అన్ని గ్రూపులకు అధికారులు టెంట్లు, టార్పాలిన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడి గ్రూపులు ఎక్కువ కావడంతో వారికి టెంట్లు లేక విరామ సమయంలో చెట్ల కింద సేద తీరుతున్నారు. పనిప్రదేశంలో ప్రథమ చకిత్స కిట్లు కూడా అందుబాటులో లేవని కూలీలు వాపోతున్నారు.


