మాస్టర్ ప్లాన్‌పై ముగిసిన కసరత్తు క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం త్వరలోనే వివిధ పనులకు టెండర్లు
భైంసా: బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రం త్వరలోనే సరి కొత్తగా రూపాంతరం చెందబోతోంది. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.225 కోట్లతో చేపట్టబోయే పనులకు సంబంధించి యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెల 10న దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌నాయక్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వచ్చే వందేళ్ల వరకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గర్భాలయం, అనివెట్టి మండపం, కాళికామాత ఆలయాల ఆధునికీకరణ తో పాటు ఆలయానికి తూర్పున వైభవోపేతమైన తోరణాల నిర్మాణం, నాలుగు వైపులా విశాలమైన రహదారుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. భక్తుల సనతి కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించనున్నట్లు హనుమంతరావు పేర్కొన్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..
బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని భవి ష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక మాస్టర్ ప్లాన్‌పై అధికారుల పర్యటన ముగిసింది. పెరుగుతున్న భ క్తుల రద్దీ, విద్యార్థుల అవసరాలు, భవిష్యత్‌లో బా సర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూ.225 కోట్ల అంచనాతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఆలయ పరిస ర ప్రాంతాలను ఆధునికీకరించడం, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రత్యేక క్యూలైన్లు, విశాలమైన పార్కింగ్ స్థలాలు, భక్తుల కోసం వసతిగృహాలు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీటి వసతి, స్నాన ఘాట్లు, రహదారుల విస్తరణ, హరిత వనాల అభివృద్ధి తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా..
అక్షరాభ్యాసం, విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు, విద్యార్థుల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఒక ఆడిటోరియం ఉపయోగపడేలా రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. దీంతో బాసరను కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా విద్యా, సాంస్కృతిక కేంద్రంగానూ అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచన స్పష్టమవుతోంది. పర్యటన సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు.
స్థానికుల అభిప్రాయాలు పరిగణనలోకి..
మాస్టర్ ప్లాన్ అమలులో స్థానిక ప్రజల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటామని అధికా రులు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బాసర రూపురేఖలు మారనున్న నేపథ్యంలో స్థానికులు, భక్తులు, విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. బాసర అభివృద్ధితో ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి కూడా కొత్త శోభ రానుందని అంతా భావిస్తున్నారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక ఆడిటోరియం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏప్రిల్ 6న బాసరకు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం ప్రత్యేక చొరవతో విద్యార్థుల కోసం ఒక ఓపెన్ ఆడిటోరియం నిర్మించనున్నట్లు దేవాదా య శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించా రు. అక్కడ విద్యా సంబంధిత అంశాలపై ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ప్రాజెక్ట్ విశేషాలను మ్యాపుల ద్వారా వివరించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.


