‘రైతులు ఆందోళన చెందొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘రైతులు ఆందోళన చెందొద్దు’

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

సారంగపూర్‌: రైతులు ఆందోళన చెందొద్దని, పండించిన చివరి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని జామ్‌, కౌట్ల(బి), సారంగపూర్‌ గ్రామాల్లోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత కారణంగా తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఐకేరెడ్డికి వివరించారు. ఒక్కో గన్నీబ్యాగు రూ.30, లారీకి ఒక బస్తాకు రూ.50చొప్పున చెల్లించి విక్రయించుకునే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. హమాలీలు అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఐకేరెడ్డి అక్కడే ఉన్న హమాలీలను ఇదేం తీరని ప్రశ్నించారు. డబ్బులు డిమాండ్‌ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉండడం విచారకరమని, ఈ విషయం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం తాలూకు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, కౌట్ల(బి) పీఏసీఎస్‌ చైర్మన్‌ అయిర నారాయణరెడ్డి, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, నాయకులు ధర్మాజి రాజేందర్‌, అట్ల మహిపాల్‌రెడ్డి, మాధవరావు, సాయినాఽథ్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement