● విద్యార్థులకు మేలంటున్న అధ్యాపకులు, పోషకులు
లక్ష్మణచాంద: నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో మాధ్యమిక విద్యలో(ఇంటర్‌లో) కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు చర్యలు చేపడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం(2026–27) నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వం అమలు చేయనున్న ఈ నూతన విధానంతో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
గతంలో ఇలా...
ఇంటర్‌లో సైన్స్ గ్రూపులు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు గతేడాది వరకు ద్వితీయ సంవత్సంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. బైపీసీ గ్రూపు విద్యార్థులకు వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, రసాయన శాస్త్రాలకు ఒక్కో దానికి 30 మార్కులు కేటాయించారు. ఎంపీసీ విద్యార్థులకు రసాయ శాస్త్రం, భౌతిక శాస్త్రం ప్రయోగ పరీక్షలు నిర్వహించారు.
రాత పరీక్షలకు 60 మార్కులు..
ఇక ఒక్కో ఏడాదిలో రాత పరీక్షలు 60 మార్కులతో నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్(ఏబీఎల్‌ను )ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. దీంతో మ్యాథ్స్‌లో 75 మార్కులకు బదులుగా 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఒక్కో ఏడాదికి 15 మార్కులు చొప్పున కేటాయించనున్నారు.
భాషా విషయాలకు...
హ్యుమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు 20 మార్కులు కేటాయిస్తారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు బదులు ఈసారి 80 మార్కులకే నిర్వహించనున్నారు. భాషా విభాగాల్లోనూ తెలుగు, ఆంగ్లంకు 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు, మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయిస్తారు.
కొత్త గ్రూపు..
ఇంటర్మీడియెట్‌లో నూతనంగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులలో ఏసీఈ అనే కొత్త గ్రూపును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉండగా, ఎకౌంటెన్సీ సబ్జెక్టుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డు కొత్త గ్రూప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏసీఈ గ్రూప్ చదివిన విద్యార్థులు సీఏతోపాటు డిగ్రీలో బీకాంలో ప్రవేశాలు పొందవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్‌లో ఎంఈసీ గ్రూప్‌లో గణితం సబ్జెక్ట్‌కు ప్రత్యేకంగా ప్రశ్నాపత్రం రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఏసీఈ గ్రూపులో రాత పరీక్షకు 80 మార్కులు, యాక్టివిటి బేస్డ్ లెర్నింగ్(ఏబీఎల్)కు 20 మార్కులు కేటాయించనున్నారు.
ఇకపై 15 మార్కులు..
మారిన విధానంతో ఎంపీసీ గ్రూపులో భౌతిక, రసాయన శాస్త్రాలకు, బైపీసీ గ్రూపులో జంతు, వృక్ష శాస్త్రాలతోపాటు రసాయన శాస్త్రం ప్రాక్టికల్స్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో నిర్వహిస్తారు. ప్రతీ ప్రాక్టికల్స్‌కు మొదటి ఏడాది 15 మార్కులు రెండో ఏడాది 15 మార్కులు కేటాయిస్తారు.


