‘కోఆప్షన్‌’లో ఎమ్మెల్యే తెరవెనుక పాత్ర | - | Sakshi
Sakshi News home page

‘కోఆప్షన్‌’లో ఎమ్మెల్యే తెరవెనుక పాత్ర

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

● మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జాబిర్‌

భైంసాటౌన్‌: ఇటీవల జరిగిన మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో తమ అభ్యర్థులకు బీజేపీ కౌన్సిలర్‌ మద్దతు తెలపడంలో ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ తెర వెనుక పాత్ర ఉందని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎండీ జాబిర్‌ అహ్మద్‌ ఆరోపించారు. వాయిదా పడిన కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక మళ్లీ ఈనెల 19న నిర్వహించేందుకు కోర్టు అనుమతులు వచ్చినట్లు పాలకపక్ష సభ్యులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మున్నూరుకాపు సామాజిక వర్గంలో చీలికకు యత్నించారని, ఆ కారణంగానే అసంతృప్త కౌన్సిలర్లు తమతో కలిసి వస్తున్నారని తెలిపారు. అయినా, ఇప్పటికే ఒకరి ఎన్నిక ధ్రువపత్రం అందిందని, మరొకరి ఎన్నికపై తాము కోర్టును ఆశ్రయించామన్నారు. ఒకవేళ పాలకపక్షం ఎన్నిక నిర్వహించినా, కోర్టు ఆర్డర్‌ వస్తే చెల్లదన్నారు. తమతో ఇప్పటికీ ముగ్గురు కౌన్సిలర్లు టచ్‌లో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్‌ రాదని, కాంగ్రెస్‌ టికెట్టు ఇప్పించాలంటూ ఎమ్మెల్యే తన అనుచరుడు ఇంతియాజ్‌ ద్వారా సంప్రదించినట్లు ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నిజం కాకుంటే ఎమ్మెల్యే హనుమాన్‌ ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరారు. చైర్మన్‌ దత్తాత్రి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై తమ పార్టీ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ తన అభిప్రాయం తెలుసుకున్నారన్నారు.

రుజువు చేస్తే రాజీనామా..

మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జాబీర్‌ అహ్మద్‌ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ స్పష్టం చేశారు. అధికారం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తను ఎంఐఎం నాయకులతో, అతని అనుచరులతో కలిసి మాట్లాడినట్లు రుజువు చేయాలని సవాల్‌ విసిరారు. రుజువు చేయనిపక్షంలో 12 మంది ఎంఐఎం కౌన్సిలర్లతో రాజీనామా చేయిస్తావా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement