నిర్మల్‌చైన్‌గేట్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్‌ఐఆర్ అమలు విధానంపై సమీక్షించారు. నిజమైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రతీ దశను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక చర్యలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వోలు), ఎన్నికల సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్‌ఐఆర్ నిబంధనలు, విధివిధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఫారాల నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ఓటరు ప్రోజెనీ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలనలు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.


