నిర్మల్‌ఖిల్లా: జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు పద్ధతిని విద్యాశాఖ మరింత విస్తరించింది. ఇప్పటివరకు బోధన సిబ్బందికి అమలు చేస్తుంది. ఇప్పుడు బోధనేతర సిబ్బందికి కూడా తప్పనిసరి చేస్తూ జిల్లా విద్యాశాఖ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన విద్యాశాఖ కార్యాలయం మాత్రమే కాకుండా, అన్ని మండలాల్లోని ఎమ్మార్సీలలో పనిచేసే సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
వేసవి సెలవుల్లో కూడా హాజరు తప్పనిసరి..
పాఠశాలలకు వేసవి సెలవుల్లో ఉన్నా, జిల్లా, మండల స్థాయిలలోని విద్యాశాఖ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నిర్ణీత సమయానికి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేయడం తప్పనిసరిగా చేశారు. జిల్లా, మండల స్థాయిల్లోని కార్యాలయాల పనితీరును సమీక్షించడంతోపాటు, హాజరు వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు.
హాజరులో నిర్లక్ష్యం..
ఇటీవల జరిగిన పరిశీలనల్లో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు నమోదు చేయకపోవడం, సరైన కారణాలు లేకుండా ఆన్‌డ్యూటీ దరఖాస్తులు సమర్పించడం వంటి వ్యవహారాలు బయటపడ్డాయి. ఈ కారణంగా హాజరు శాతం తగ్గడంతో పాటు, కార్యాలయాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నియమాలు మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు.
అధికారులకు ప్రత్యేక ఆదేశాలు
ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మండల విద్యాధికారులు, జిల్లా శాఖ కార్యాలయ సూపరింటెండెంట్లు తమ పరిధిలోని సిబ్బంది హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ ఉద్యోగి రోజువారీగా నిర్ణీత సమయానికి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేయడం తప్పనిసరి అని, ఆన్‌డ్యూటీ సదుపాయం కేవలం అత్యవసర పరిస్థితుల్లో, సహేతుక కారణాలతోనే ఉపయోగించాలని స్పష్టం చేశారు. అలాంటి సందర్భాల్లో ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కూడా సూచించారు.
క్లస్టర్, సెంటర్ సిబ్బందికి బాధ్యత
పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే వరకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీలు), ఐఈఆర్‌పీలు, ఎంఐఎస్, కంప్యూటర్ ఆపరేటర్లు వంటి విద్యాధికార సిబ్బంది తమ హాజరును సంబంధిత ఎమ్మార్సీ కేంద్రాల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా నమోదు చేయాలి. మండల స్థాయిలో ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ వ్యవస్థపై పర్యవేక్షణ చేపట్టాలి. ఆలస్యాలు, నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
అలసత్వానికి తావులేకుండా...
హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం కేవీ తీసుకోకూడదని స్పష్టం చేస్తూ, ఈ విధానాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొంటున్నారు. జిల్లాలోని బోధన, బోధనేతర సిబ్బంది అందరూ విధుల్లో క్రమశిక్షణతో వ్యవహరించడం అత్యంత కీలకమని, ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా నిర్దేశిత సమయానికి హాజరు నమోదు చేయడంలో ఎలాంటి అలసత్వానికి తావు లేదని సూచిస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో హాజరు వ్యవస్థపై పటిష్టమైన పర్యవేక్షణ, మానిటరింగ్ ఉంటుందని డీఈవో భోజన్న తెలిపారు. ఉల్లంఘిచేవారిపై చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.


