పుస్తకాలొచ్చినయ్‌ | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలొచ్చినయ్‌

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

● 81 శాతం జిల్లాకు చేరిక ● మే 10 నుంచి ఎమ్మార్సీలకు..

జూన్‌ 12న విద్యార్థులకు పంపిణీ..

లక్ష్మణచాంద: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమైన వారం రోజులకే.. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తిరిగి పాఠశాలలు తెరుచుకున్న రోజునే పుస్తకాలు అందించేలా విద్యాశాఖ ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 81 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లా గోదాములకు చేరినట్లి అధికారులు తెలిపారు.

పార్ట్‌ 1, పార్ట్‌ 2గా విభజన..

కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాలను రెండు భాగాలుగా పార్ట్‌ 1, పార్ట్‌ 2గా విభజించి విద్యార్థులకు అందిస్తున్నారు. పార్ట్‌–1లో కొన్ని అధ్యాయాలు, పార్ట్‌–2లో మిగిలిన అధ్యాయాలు ముద్రిస్తున్నారు. జిల్లాకు పార్ట్‌ 1 పుస్తకాలు మొత్తం 3,35,880 అవసరం కాగా, మంగళవారం వరకు 2,73,830 పుస్తకాలు చేరాయి. అంటే 81 శాతం పుస్తకాలు జిల్లాకు వచ్చాయని, మిగిలిన 62,050 పుస్తకాలు కూడా త్వరలోనే చేరుతాయని అధికారులు తెలిపారు.

జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య..

జిల్లాలో 577 ప్రభుత్వ పాఠశాలలు, 89 ప్రాథమికోన్నత పాఠశాలలు, 164 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు కలిపి మొత్తం 848 పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పాఠశాలల్లో 71,390 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

పాఠశాల ప్రారంభం రోజు పంపిణీ

నూతన విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాలలో 81 శాతం జిల్లాకు చేరాయి. మిగిలినవి కూడా త్వరలోనే చేరుతాయి. పాఠశాలల ప్రారంభం రోజు ప్రతీ విద్యార్థికి పుస్తకాలు అందచేయాలని ఎంఈవోలకు, ప్రధానో పాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. – భోజన్న, డీఈవో

జిల్లా సమాచారం

ప్రాథమిక పాఠశాలలు 577

ప్రాథమికోన్నత పాఠశాలలు 89

ఉన్నత పాఠశాలలు 164

కేజీబీవీలు 18

మొత్తం పాఠశాలలు 848

మొత్తం విద్యార్థులు 71390

అవసరమైన పార్ట్‌–1 పుస్తకాలు 3,35,880

ఇప్పటి వరకు వచ్చినవి 2,73,830

ఎమ్మార్సీలకు పుస్తకాలు..

జిల్లా కేంద్రానికి చేరిన పాఠ్య పుస్తకాలను మే 10 నుంచి అన్ని మండలాల ఎమ్మార్సీలకు సరఫరా చేయాలని జిల్లా విద్యాధికారి భోజన్న ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మార్సీల నుంచి ఆ మండలానికి చెందిన అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పుస్తకాలు అందించడం జరుగుతుంది. పాఠశాలలు తెరుచుకున్న రోజున ప్రతి విద్యార్థికీ తగిన పుస్తకాలు అందించేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement