ఖానాపూర్: ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక మహేందర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లో ఆదివారం కలిశారు. జిల్లా అధ్యక్షుడు రితేష్‌రాథోడ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఖానాపూర్ మున్సిపల్ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయిన వారికి తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో నూతన పురపాలక సంఘ భవన నిర్మాణం, ఆధునిక గ్రంథాలయ భవనం ఏర్పాటు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల స్థాపన, 100 పడకల ఆస్పత్రి నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నవించారు. అనంతరం సోమాజీగూడలో ఆదివారం పీఎం నరేంద్రమోదీ 133వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రితేష్ రాథోడ్ రాష్ట్ర నాయకులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు బొప్పారపు సత్యవతి, గుమ్ముల ఆనంద్, ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.


