నిర్మల్‌టౌన్/భైంసాటౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మాహుతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు, పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరింది. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిర్మల్, భైంసా పట్టణాల్లో ర్యాలీ తీశారు. నిర్మల్ డిపో నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. భైంసాలో డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని, ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, సీడీఎస్‌యూ జిల్లా కన్వీనర్ కిరణ్, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు ఎస్‌ఎన్.రెడ్డి, భైంసా డిపో జేఏసీ చైర్మన్ గంగయ్య, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


