బదిలీలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బదిలీలకు వేళాయె

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్‌కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ మూడేళ్లు ఒకేచోట పనిచేసేవారు అర్హులు నాలుగేళ్లు ఒకేచోట ఉంటే తప్పనిసరి.. మొత్తం సిబ్బందిలో బదిలీలు 40 శాతానికి మించొద్దు స్పౌజ్‌ కేసులు, క్యాన్సర్‌ బాధితులకు ప్రాధాన్యం

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా గత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఈ బది లీల ప్రక్రియ కొనసాగనుంది. గతంలో ఉన్న బది లీల నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తూ, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా ఆన్‌లైన్‌ లేదా కౌన్సెలింగ్‌ పద్ధతిని అనుసరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మూడేళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే...

మూడేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులను ఈదఫా బదిలీ చేయరాదని ఆదేశించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీలకు అర్హులు. ఏఒక్క ఉద్యోగిని కూడా ఒకేచోట నాలుగేళ్లకు మించి కొనసాగించకూడదని కచ్చితమైన ఆదేశాలు జారీచేసింది. తద్వారా సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలగనుంది.

వీరికి ఊరట..

ఏ క్యాడర్‌ లోనైనా సరే మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరట కల్పించారు. క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, బోన్‌ టీబీ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ సమస్యలు ఉన్నా బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందుకు సంబంధించి మెడికల్‌ బోర్డు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. క్లిష్టమైన ప్రాంతాల్లో దీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులకు ఈసారి గుర్తింపు లభించనుంది. ప్రతీ శాఖ తమ పరిధిలోని అలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ పనిచేసిన వారికి వారు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేలా వెయిటేజీ కల్పించనున్నారు. ఒకవేళ అలాంటి ప్రాంతాలకు ఎవరూ స్వచ్ఛందంగా వెళ్లకపోతే, లాటరీ పద్ధతి ద్వారా పంపాలని నిర్ణయించారు.

జిల్లాలోని మొత్తం ఉద్యోగులు 7,150

నిర్మల్‌ ట్రెజరీ పరిధిలో ఉద్యోగులు 4,079

భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలో 1,338

ఖానాపూర్‌ సబ్‌ ట్రెజరీ పరిధిలో 1,062

ముధోల్‌ సబ్‌ ట్రెజరీ పరిధిలో 671

Advertisement
 
Advertisement
Advertisement