అరకొర వసతులు..
నిర్మల్‌చైన్‌గేట్: పాలకులు పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని చెప్పినా, జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు 1,000–1,200 మంది ఓపీ, అడ్మిషన్ కేసులు ఉన్నా సరైన సౌకర్యాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీనియర్ వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. హౌస్ సర్జన్లు, పీజీలు, ఎస్‌ఆర్‌లు మాత్రమే రోగులను పరీక్షిస్తున్నారు. తర్వాత వీరు సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. ఎమర్జెన్సీల్లో జూనియర్లు సరైన అనుభవం లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు.
కీలక విభాగాల్లో సమస్యలు..
గుండె, గ్యాస్ట్రో, న్యూరాలజీ, యూరాలజీ వంటి నిపుణులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మూడు గంటలు మాత్రమే ఓపీ సేవలు ఉండటంతో అత్యవసర కేసులు పెరుగుతున్నాయి. పేదలు ప్రైవేట్ చికిత్సకు సాధ్యం కాక ఆసుపత్రిలోనే ఉండి బాధలు అనుభవిస్తున్నారు.
పీహెచ్‌సీలలో వైద్యుల కొరత
జిల్లాలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ముధోల్ సీహెచ్‌సీ ఉన్నాయి. పీహెచ్‌సీలో 40 పోస్టులకు 21 మంది పనిచేస్తున్నారు. పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు, దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక పోస్టుకు ఒక్కరు కూడా లేరు.
నర్సాపూర్(జి)లో...
మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిలో రోగులకు ఎక్స్‌రే సేవలు అందుతున్నప్పటికీ ఫిల్మ్ ప్రింట్ తీసే రిపోర్టు మిషన్ పని చేయడంలేదు. దీంతో రిపోర్టును రోగి ఫోన్‌కు పంపిస్తున్నారు. దగ్గు మందు మూడు నెలలుగా రావడంలేదు.
లక్ష్మణచాందలో..
వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ ప్రతిరోజు 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేస్తున్నామన్నారు. వేసవిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల ఔషధాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి.
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు
అనే పరిస్థితి మారిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగయ్యాయని, నాణ్యమైన వైద్యం అందుతోందని పాలకులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్య సిబ్బందితో గ్రామాల్లో ప్రచారం చేయిస్తున్నారు. కానీ, సర్కారు ఆస్పత్రులకు వచ్చిన తర్వాత మాటలకు.. అందే వైద్యానికి పొంతన ఉండడం లేదు. వేసవి నేపథ్యంలో జిల్లాలోని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న మందులు, అందుతున్న వైద్య సేవలపై సాక్షి విజిట్ చేసింది. ఇందులో చాలా ఆస్పత్రుల్లో మొక్కుబడి వైద్యం.. అరకొర వసతులే కనిపించాయి.


