కుక్క కాటుకు మందు లేదు.. | - | Sakshi
Sakshi News home page

కుక్క కాటుకు మందు లేదు..

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

● ఖానాపూర్‌లో యాంటీ రేబిస్‌ టీకాల కొరత ● సీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కొరత

ఖానాపూర్‌: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో యాంటీ రేబిస్‌ టీకాల కొరత తీవ్రంగా ఉంది. నె లకొంది. బుధవారం ఆసుపత్రిని సందర్శించగా ఈ విషయం స్పష్టమైంది. కుక్కలు, కోతుల కాట్లకు గురైన బాధితులకు పూర్తి డోసులు అందడంలేదు. వైద్యాధికారులు, సిబ్బంది మందుల కొరత కారణంగా పలువురు బాధితులకు మొదటి ఇంజక్షన్‌ మాత్రమే ఇచ్చి, రెండో, మూడో డోసులు వేయకుండా తిరిగి పంపిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉన్నవారే ప్రాధాన్యత ఇస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. బుధవారం సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన విజయ అనే మహిళ కాలును కుక్క కరవడంతో ఆస్పత్రికి చేరుకుని మొదటి ఇంజక్షన్‌ వేయించుకుంది. ఇక్బాల్‌పూర్‌ గ్రామానికి చెందిన భీమన్న కూడా కుక్క కాటుకు టీకా తీసుకున్నారు. అయితే శివాజీ నగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి శ్రీనివాస్‌కు కోతి కరవడంతో మూడో డోస్‌ కోసం ఆస్పత్రికి వచ్చినప్పటికీ టీకాలు లేకపోవడంతో తిరిగి పంపించారు. ‘‘మందుల కొరత ఉంది. ప్రస్తుతం మొదటి, రెండో డోసులు మాత్రమే వేస్తున్నాం. మూడో డోస్‌ కోసం మరోరోజు రావాలి’’ అని సిబ్బంది తెలిపారు. ఆస్పత్రిలో యాంటీ రేబిస్‌ వాక్సిన్‌ కొరత ఉందని సూపరింటెండెంట్‌ వంశీ మాధవ్‌ తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

ఆస్పత్రిలో సమస్యలు..

ఖానాపూర్‌ ఆస్పత్రిలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ అధికారి పోస్టుతోపాటు డెంటిస్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఎక్స్‌రే యంత్రం మదర్‌బోర్డ్‌ సమస్య కారణంగా పనిచేయకుండా నిలిచిపోయింది. దీంతో రోగులు ప్రైవేట్‌గా ఎక్స్‌రే తీసుకుంటున్నారు. వాటర్‌ ప్లాంట్‌ కూడా పనిచేయకపోవడంతో సిబ్బంది, రోగులు ప్రైవేట్‌గా తాగునీటిని కొనుగోలు తెచ్చుకుంటున్నారు. వార్డుల్లో కూలర్‌ ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.

కడెంలో వైద్యుల కొరత..

కడెం: కడెం ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం భవనం, రోగులకు సౌకర్యాలు ఉన్నా వైద్యుల కొరత ఏళ్లుగా తీరని సమస్యగా మారింది. ఐదుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం అన్ని రకాల మందులు, పరీక్షలు నిర్వహిస్తున్నా, ఫార్మసిస్ట్‌, ఏఏఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దస్తురాబాద్‌ ఆస్పత్రికి రాని డాక్టర్‌..

దస్తురాబాద్‌: మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌ రారు, అసలు ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌ను కేటాయించడం లేదు. ఇన్‌చార్జి డాక్టర్‌తో నే నెట్టుకొస్తున్నారు. ఆ ఇన్‌చార్జి డాక్టర్‌ లోకేశ్వరం ఆరోగ్య కేంద్రంలో ఉంటున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో 5 ఉప కేంద్రాలు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌, హెచ్‌ఈవో, సీనియర్‌ ఆసిస్టెంట్‌, స్టాప్‌నర్సు, ఏఎన్‌ఎం సిబ్బంది కొరత ఉంది. రోగులకు వైద్యం అందిచే గదులలో ప్యాన్లు పనిచేయడం లేదు. ఆరోగ్య కేంద్రం ప్రహరీ రెండేళ్ల క్రితం వర్షానికి కూలిపోయింది.

పెంబిలో వైద్యులు, సిబ్బంది కొరత..

పెంబి: పెంబి ఆసుపత్రి వైద్యుడే స్థానికులతోపాటు ఖానాపూర్‌లోనూ వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. పెంబిలో రెగ్యూలర్‌ మెడికల్‌ అధికారి లేకపోవడంతో ఇక్కడ కాంట్రాక్ట్‌ బేసిక్‌పై పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి మెడికల్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement