నిర్మల్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ మండలం డ్యాంగాపూర్ బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు, పోషకులతో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పోషకులు తల్లిదండ్రుల సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. విద్యార్థుల ప్రగతి వివరాలు తల్లిదండ్రులకు తెలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు సెలవులు ముగియగానే సమయానికి పాఠశాలకు రావాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు నైపుణ్యాలు, అర్హతలు ఉన్న ఉపాధ్యాయులతో విద్యాబోధన జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు వార్షిక ప్రగతి నివేదికలు అందించారు. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించి, బహుమతులు అందించారు. డీటీడీవో అంబాజీ, డీఈవో భోజన్న, సీపీవో జీవరత్నం, తహసీల్దార్ ప్రభాకర్, హెచ్‌ఎం శైలజ, సర్పంచ్ నవీన్‌యాదవ్ పాల్గొన్నారు.


