● అద్దెబస్సులు నడిపించిన యాజమాన్యం
నిర్మల్‌టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిపో కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. దీంతో ఉదయం నుంచి ప్రయాణికులు బస్టాండ్ వద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఆటోలు, వివిధ ప్రైవేటు వాహనాలపై ఆధారపడ్డారు. ఈ క్రమంలో అధికారులు అవసరమైన చోట తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడం వంటి చర్యలు చేపట్టారు. భైంసా, నిజామాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్‌తో పాటు ప్రధాన రూట్లలో 70 బస్సులు రాకపోకలు సాగించాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ విడుదల చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.
కండక్టర్ లేకుండానే రైట్‌రైట్..!
భైంసాటౌన్: ప్రభుత్వ తీరును నిరసిస్తూ భైంసా పట్టణంలోని డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. కాగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ హైర్ బస్సులు నడిపారు. అయితే కండక్టర్లు లేకుండానే బస్సులు నడపడంతో పురుషులు, మహిళలు ఉచితంగానే ప్రయాణించారు. భైంసా డిపోలో 47 హైర్ బస్సులు ఉండగా, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, తదితర రూట్లలో 31 సర్వీసులు నడిపినట్లు డీఎం హరిప్రసాద్ తెలిపారు. అన్ని రూట్లలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


