చీకట్లో ఇసుక దందా | - | Sakshi
Sakshi News home page

చీకట్లో ఇసుక దందా

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

మహారాష్ట్ర, నిజామాబాద్‌ నుంచి జిల్లాలోకి అక్రమంగా..

పగలు ఆర్డర్‌ తీసుకుని రాత్రి రవాణా

ప్రభుత్వ ఆదాయానికి గండి

తానూరు: జిల్లాలో చీకట్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇసుక అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ, అక్రమ దందా ఆగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. పొరుగున ఉన్న నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, కారేగాం, నాగని గ్రామాల నుంచి ఇసుక జిల్లాక అక్రమంగా చేరుతోంది. రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారుల నిఘా రొనవడడంతో ఇసుక దందా జోరందుకుంటోంది.

సరిహద్దు గ్రామాల్లో డంపులు..

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, కారేగాం, నాగని, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ప్రాంతాల నుంచి అక్రమంగా రాత్రిపూత తెస్తున్న ఇసుకను తానూరు–ముధోల్‌ మండలాల సరిహద్దు గ్రామాలైన జౌలా(బి), ఎల్వత్‌, కోలూరు, వడ్గాం, వాడవన ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆర్డర్ల మేరకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు ఏజెంట్లు అధికారుల చేతులు కలిపి దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తానూరు–ముధోల్‌ సరిహద్దులో

ఇసుక మార్కెట్‌

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తానూరు, ముధోల్‌ మండలాలు ఇసుక అక్రమ వాణిజ్యానికి హాట్‌స్పాట్‌గా మారాయి. జౌలా(బి), తానూరు శివారు ప్రాంతాల్లో భారీ ఇసుక కుప్పలు నిల్వ ఉన్నాయి. బడా వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కుమ్మకై తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేయించి, తెలంగాణ ప్రాంతాలకు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అధికారులకు తెలిసే జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ, పోలీస్‌ తనిఖీలు..

అప్పుడప్పుడు రెవెన్యూ అధికారులు తానూరు ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. గత నెల మహారాష్ట్ర ధర్మాబాద్‌ నుంచి అక్రమంగా ఇసుక తెస్తున్న టిప్పర్‌ను పట్టుకుని జరిమానా విధించారు. తానూరు మండలం కోలూరులో ఇసుక టిప్పర్‌ను గుర్తించి జరిమానా విధించారు. పక్షం రోజుల క్రితం జౌలా(బి) గ్రామ సమీపంలో ఇసుక లారీని పోలీసులు పట్టుకుని రెవెన్యూ సిబ్బందికి అప్పగించారు.

అక్రమ రవాణాపై ఉక్కుపాదం..

అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రావాణా జరిగుతున్న విషయం తమ దృష్టికి రాలేదు. సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటాం.

– హరిప్రసాద్‌, జిల్లా మైనింగ్‌ అధికారి

అనుమతి పత్రాలు లేకుండా..

అనుమతి పత్రాలు లేకుండా మహారాష్ట్ర నుంచి ఇసుకను తీసుకురావడం, పన్నులు చెల్లించకుండా అమ్మకం చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇసుక వ్యాపారులు తక్కువ ధరకు పొరుగు ఇసుక కొని.. ఎక్కువ ధరకు స్థానికులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు రెవెన్యూ సిబ్బంది కొన్ని టిప్పర్లు లేదా ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగిస్తున్నప్పటికీ పోలీసులు ‘మామూలు’గా చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

చోద్యం చూస్తున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement