బాసర: అక్షయ తృతీయ పురస్కరించుకుని బాసర శ్రీజ్ఞానసరస్వతీ క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అమ్మవారికి వైదిక బృందం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. బంగారు లక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని ఈవో విజయ రామారావు వెల్లడించారు. అక్షయ తృతీయ రోజు గురుపూజోత్సవం సకల శుభాలను ఇస్తుందని వైదికులు వెల్లడించారు.


