నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లాలోని చారిత్రక కోటలపై జరుగుతున్న పరిశోధనలు కొత్త విశేషాలను వెలుగులోకి తెస్తున్నాయి. తాజాగా రహస్య మెట్లబావి చరిత్రాభిమానులను, జిల్లావాసులను అలనాటి నిర్మల్ వైభవం ఆకట్టుకుంటోంది. పద్మనాయకుల కాలంలో నిర్మితమైన బత్తీస్‌గఢ్ కోట తూర్పు దిక్కున బలమైన రక్షణ నిర్మాణాలతో నిలిచివుంది. ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోటలో సుమారు 500 మీటర్ల ఎత్తులో రాజులు సైనిక స్థావరంగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సైనిక అవసరాల కోసం ప్రత్యేకంగా రహస్యంగా ఒక మెట్లబావిని నిర్మించారు. కోట తూర్పు భాగంలో ఉన్న ఈ బావికి చేరుకోవాలంటే రెండు గదుల గుండా లోపలికి వెళ్లాలి. పూర్తిగా దృఢమైన రాళ్లతో నిర్మించిన ఈ బావిలోకి దిగేందుకు సుమారు 200 మెట్లు ఏర్పాటు చేశారు.
అబ్బురపరిచే నిర్మాణశైలి...
మెట్ల బావి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఇది సాధారణ నీటి అవసరాల కోసం కాకుండా రహస్య స్థావరంగా ఉపయోగించినట్టు తెలుస్తోంది. బావి చుట్టూ సైనికులు పహారా కోసం కోట గోడల్లో రహస్య రంధ్రాలను ఏర్పాటు చేశారు. బయటి నుంచి వచ్చే కదలికలను గమనించేందుకు వీలుగా వీటిని విని యోగించినట్లు భావిస్తున్నారు. బావి అడుగుభాగం దీర్ఘచతురస్త్రాకారంలో ఉండగా, అక్కడి నుంచి సుమారు ఒక మీటరు వెడల్పుతో సొరంగ మార్గం నిర్మించారు. ఈ మార్గం ద్వారా శత్రువుల నుంచి తప్పించుకోవడం లేదా ఇతర కోటలకు చేరుకోవడం సాధ్యమయ్యేదని స్థానికులు చెబుతున్నా రు. ఈ సొరంగం ప్రస్తుతం సుమారు పది మీటర్ల వరకు పరిశీలించే వీలుంది. తెలంగాణలో అనేక మెట్లబావులు ఉన్నప్పటికీ, బత్తీస్‌గఢ్ కోటలోని ఈ రహస్య నిర్మాణం ప్రత్యేకతను సంతరించుకుంది. రహస్య ద్వారాలు, భద్రతా ఏర్పాట్లు, సొరంగ మార్గం వంటి లక్షణాలు ఈ బావి వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అరుదైన నిర్మాణాన్ని సంరక్షించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని డాక్టర్ తుమ్మల దేవరావ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్షేత్ర పర్యటనలో అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.


