అందుబాటులోకి స్మృతివనం నేడు అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం తరలిరానున్న ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు
1981 ఏప్రిల్ 20. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. వారి అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 45 ఏళ్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. అలాగే ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – ఇంద్రవెల్లి
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకున్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతో పాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి.
అసలేం జరిగింది..
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్దమైన హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పా టు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉద యం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకే ప్రాంగణం గిరి పుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరిజన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడిపై దాడి చేయగా నెలకొరిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15 మంది ఆదివాసీలు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ అప్పుడు తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మంది వరకు మృతి చెందినట్లు పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది.
33 ఏళ్లు.. నివాళులకు దూరం
నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి రా ష్ట్రపాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా బందోబస్తు ఏ ర్పాటు చేసేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపూరావ్ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీలు ఆ రోజున ఆంక్షల నడుమ నివాళులర్పి ంచడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించింది. రెండు గంటల సమయం ఇవ్వడంతో ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేసి నివాళులర్పి స్తూ వచ్చారు.
రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం
ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపం నిర్మించింది. దానిని 1986 మార్చిలో గుర్తుతెలియని వ్యక్తులు డైనమేట్ల తో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో మళ్లీ నిర్మించింది.
అమరవీరుల ఆశయ సాధన కోసం రిలే దీక్షలు
నాటి ఆదివాసీ అమరుల ఆశయ సాధన కోసం ఇటీవల కొద్ది రోజుల పాటు ఆదివాసీలు స్తూపం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు.


