చేద్దామా.. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌..! | - | Sakshi
Sakshi News home page

చేద్దామా.. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌..!

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

● 26 నుంచి ప్రారంభం కానున్న జనగణన ● వెబ్‌సైట్‌లో స్వీయ నమోదుకు అవకాశం

భైంసాటౌన్‌: జనగణనకు అఽధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి స్వీయ నమోదుకు అవకాశమివ్వగా, మే 10 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయి జనగణన చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్యూమరేటర్లకు జన గణనపై శిక్షణ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో లేనివిధంగా ఈసారి సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌(స్వీయ నమోదు)కు కేంద్రం అవకాశమిచ్చింది. దీంతో ప్రజలే తమ కుటుంబ సభ్యుల వివరాలను వెబ్‌సైల్‌లో నమోదు చేసుకోవచ్చు. తరువాత ఇంటికి వచ్చే ఎన్యూమరేట్లకు మళ్లీ ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. స్వీయ నమోదు తరువాత వచ్చే ఐడీ నంబర్‌ను వారికి చెబితే సరిపోతుంది.

1,548 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్స్‌..

జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో తహసీల్దార్లు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు జనగణన పర్యవేక్షించనున్నారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఇళ్ల జాబితాలను తయారుచేసి, ఆ కుటుంబాల్లోని వారి జీవన స్థితిగతులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. జిల్లాలో మొత్తం 1,548 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌ను గుర్తించారు. ఇప్పటికే ఆయా ఇళ్లకు సంబంధించి జియో ట్యాగింగ్‌, హద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఒక్కో బ్లాక్‌కు ఒక్కో ఎన్యుమరేటర్‌, ఆరుగురికి ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు.

స్వీయ నమోదు ఇలా..

ప్రజలే స్వచ్ఛందంగా జనగణన పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ద్వారా స్వయంగా ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకునే ఏర్పాట్లు చేశారు. ముందుగా es.censusindia.gov.in అనే అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌పై క్లిక్‌ చేస్తే లాగిన్‌ అని పేజీ వస్తుంది. ఇందులో రాష్ట్రం, క్యాప్చా నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యూజర్‌ నేమ్‌, ఫోన్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ నమోదు చేస్తే ఫోన్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంభమవుతుంది. శాటిలైట్‌ మ్యాప్‌ కనిపిస్తూనే చిరునామా, పిన్‌కోడ్‌ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా ఆక్యుపెన్సీ, రేఖాంశాల వివరాలు తీసుకుని మీ ఇంటిని మ్యాప్‌లో నమోదు చేస్తుంది.

ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి..

మీ ఇల్లు మట్టితో కట్టిందా..? సిమెంట్‌ ఇటుకలదా..? గోడల పరిస్థితి ఏంటి..? ఇల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? తాగునీటి సౌకర్యం, టాయిలెట్‌ ఫె సిలిటీ, వంటకు వాడే ఇంధనం.. ఇలా సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, లింగం, విద్యార్హతలు, వృత్తి, వైవాహిక స్థితి.. ఇలా అన్నీ నమోదు చేశాక సేవ్‌ చేసుకుంటూ వెళ్లాలి. చివరకు ప్రివ్యూ చూసుకుని సబ్మిట్‌ చేయాలి. తరువాత ఓ రిఫరెన్స్‌ నంబర్‌ వస్తుంది. దానిని మనం భద్రంగా దాచుకోవాలి. మే 10 నుంచి ఎన్యుమరేటర్‌ మన ఇంటికి వచ్చినప్పుడు ఆ నంబర్‌ ఇస్తే సరిపోతుంది. మళ్లీ మన వివరాలను వారికి చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement