ఈత.. అంటే చిన్న నుంచి పెద్దదాకా అందరికీ సరదా. అందులో వేసవిలో ఈత కొట్టడమంటే అందరూ ఎగిరి నీళ్లలో గంతేస్తారు. కానీ.. నిర్మల్‌వాసులకు ఆ సరదా తీరడం లేదు. జిల్లాగా ఏర్పడి దశాబ్దం గడిచినా పాలకులు, అధికారులు కనీసం ఒక్క స్విమ్మింగ్‌పూల్ కూడా కట్టించలేకపోయారు. దీంతో సరదా కోసం, సేద తీరేందుకు, ప్రత్యేకంగా ఈత నేర్చుకోవడానికి ప్రైవేటుగా అధికంగా డబ్బులు చెల్లించాలి. లేదంటే చెరువులు, కుంటల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇలా.. ఈతకు వెళ్లి పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటనలూ జిల్లాలో ఉన్నాయి. –నిర్మల్
జిల్లాకేంద్రంగా ఎదిగిన నిర్మల్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఈత కొలను నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతూనే ఉన్నారు. కానీ.. పాలకులు శ్రద్ధ పెట్టడం లేదు. గతంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలోనే ఓ మూలన స్విమ్మింగ్‌పూల్ కూడా నిర్మిస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఆ స్టేడియం నిర్మాణమే ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇక ఈతకొలను నిర్మిస్తారన్న ఆశలు ఎప్పుడో ఆవిరయ్యాయి. చేసేది లేక.. చిన్నారులు, పెద్దలు నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులను ఆశ్రయిస్తున్నారు.
ప్రాణాలు పోయాయి..
సరదాగా నీళ్లలో ఈత నేర్చుకుందామని వెళ్లిన చిన్నారులు, యువకులు గతంలో నీళ్లలోనే కలిసిపోయారు. లోతు తెలియకుండా నీళ్లలోకి దిగడం, సరిగా ఈత రాకపోవడంతో పలువురు చిన్నారులు చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో పడి మృతిచెందారు. చాలా చెరువుల్లో ఇష్టారీతిన పూడిక తీయడంతో వర్షకాలంలో అవి నిండిపోయాయి. లోతు తెలియకుండా అందులోకి దిగిన పిల్లలు మృత్యువాత పడ్డారు. నిర్మల్ శివారులోని సిద్దాపూర్ వద్ద ఉన్న వాగు, సరస్వతి కెనాల్‌లోనూ ఈత కోసం వెళ్లి పలువురు యువకులు చనిపోయారు. ప్రైవేటు స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నా.. పేద మధ్యతరగతి కుటుంబాలు ఫీజులు కట్టలేకపోతున్నారు.
స్విమ్మింగ్‌పూల్ ఉంటే..
ప్రభుత్వం క్రీడాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించాలి. ఈత కొలను ఉండటం వల్ల దాంట్లో ప్రత్యేకంగా స్విమ్మింగ్ నేర్పించేందుకు కోచ్ ఉంటారు. ఆయన సంరక్షణలో చిన్నారులు ఈతను నేర్చుకుంటారు. అలాగే కొలను కూడా వయసు, ఎత్తులకు తగ్గట్లుగా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈత నేర్చుకునేలా నిర్మించి ఉంటుంది. దీంతో ప్రాణాపాయం ఉండదు. కొలనులోని నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు. చర్మవ్యాధులూ వ్యాపించవు. అందుకే ఈతకొలను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


