ఇంటికే పోషకాహారం | - | Sakshi
Sakshi News home page

ఇంటికే పోషకాహారం

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

వేసవి నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు..

వేసవి నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి పోషకాహారం సరుకులు లబ్ధిదారుల ఇంటికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1, 2వ తేదీలలో అబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి సరుకులు తీసుకోవాలి.

– వినూత్న జిల్లా సంక్షేమాధికారి

లక్ష్మణచాంద: రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రస్తుతం 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచే వేడి మొదలవుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఎండకు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే సమయంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలలో సరైన వసతులు లేకపోవడం, కొన్ని కేంద్రాలలో ఫ్యాన్లు సరిగా లేకపోవడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. గర్భిణులు, బాలింతలు కూడా రావడానికి సుముఖత చూపడం లేదు. దీనిని అధిగమించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి అంగన్‌వాడి కేంద్రాలకు సెలవులు ప్రకటించింది.

ఇంటికే సరుకులు...

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మే 1 నుంచి అంగన్‌వాడీ సరుకులను లబ్ధిదారులకు ఇంటికి పంపించాలని నిర్ణయించింది. ఇది వరకే జిల్లా సంక్షేమ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఇంటికి సరుకులు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. జూన్‌ 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.

జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు

జిల్లా వ్యాప్తంగా 19 మండలాలు 400 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం నాలుగు ప్రాజెక్టులు ఉ న్నాయి.నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా, ముధోల్‌ ప్రా జెక్టుల పరిధిలో 931 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో చిన్నారులు 56,588, గర్భిణులు 4, 904, బాలింతలు 4,798 మంది నమోదయ్యారు.

పంపిణీ ఇలా...

ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు బాలామృతం, 16 గుడ్లు, మూడు నుంచి ఆరేళ్ల వయసు వారికి రోజు 75 గ్రాముల బియ్యం 15 గ్రాముల పప్పు, ఐదు గ్రాముల నూనె, 30 గుడ్లు, 20 గ్రాముల మురుకులు అందిస్తారు. గర్భిణులు బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, 200 మి.లీ పాలు, 30 గుడ్లు పంపిణీ చేస్తారు. కేంద్రాల వద్ద లబ్ధిదారుల ముఖ హాజరు నమోదు చేసుకుని నెలకు అందచేసే సరుకులు పంపిణీ చేస్తారు.

జిల్లా సమాచారం...

జిల్లాలో ప్రాజెక్టులు 04

మండలాలు 19

గ్రామ పంచాయతీలు 400

అంగన్‌వాడీ కేంద్రాలు 931

చిన్నారులు 56,588

గర్భిణులు 4,904

బాలింతలు 4,798

Advertisement
 
Advertisement
Advertisement