నిర్మల్‌టౌన్: తల్లిదండ్రులు పిల్లలకు(మైనర్లు) వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావొద్దని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. ‘అరైవ్ అలైవ్‘ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు శనివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమన్నారు. చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు చాలా తీవ్రమైనవని, అలాంటి ఘటనల్లో ప్రాణ నష్టం, శాశ్వత గాయాలు కలగవచ్చని వివరించారు. వేగ పరిమితులు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం లాంటి ప్రాథమిక రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో తల్లిదండ్రులదే బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సమ్మయ్య, ఆర్‌ఐ రామ్‌నిరంజన్, ఎస్సైలు, మైనర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
భైంసారూరల్: అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని భైంసా ఏఎస్పీ రాజేశ్ మీనా అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మాటేగాం గ్రామంలో వాహనదారులకు, గ్రామస్తులకు ట్రాఫిక్ నియమాలపై శనివారం అవగాహన కల్పించారు. ద్విచక్ర వామనాదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణించడం చట్టవిరుద్ధమని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సుప్రియ, పోలీసులు, వాహనదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నిర్మల్‌టౌన్: రహదారి భద్రత నియమాలను వాహనదారులు పాటించాలని జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ శివారులోని ఆర్టీవో కార్యాలయంలో సిబ్బందికి రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని, వేగపరిమితులను కచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించొద్దని తెలిపారు. ఓవర్ లోడ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాజేందర్, డీఈవో భోజన్న, ఎంవీఐ మహేందర్, ఆర్టీవో సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు.


