ఖానాపూర్: ఖానాపూర్‌లో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం అభివృద్ధి పనుల నేపథ్యంలో రాష్ట్రస్థాయి పరిశీలన బృందం శుక్రవారం మినీస్టేడియాన్ని సందర్శించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో స్టేడియం పరిస్థితులను సమీక్షించింది. స్టేడియానికి అవసరమైన మౌలిక వసతులు, మరమ్మతు పనులు, క్రీడా పరికరాలపై వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఏటీజీ అసిస్టెంట్ ఇంజినీర్లు లక్ష్మి, సౌమ్య, మనోహర్, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.


