నిర్మల్‌చైన్‌గేట్: యాసంగి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే జిల్లాలోని మొక్కజొన్న, జొన్న, శనగ పంటలు చేతికి వచ్చాయి. మరో పది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్నాయి. అయినా ఇప్పటికీ యాసంగి పంటలకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అన్నదాతకు అందలేదు. 20 రోజుల క్రితం ఒక్కో ఎకరాకు సంబంధించి రైతులందరి ఖాతాల్లో రూ.6 వేల పెట్టుబడి డబ్బులు జమచేశారు. క్రమంగా అందరికీ ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ, 20 రోజులు గడిచినా పెట్టుబడి ఎకరం దాటలేదు. దీంతో పంట కాలం పూర్తి కావొస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. ఖరీఫ్ సీజన్‌లో పూర్తిస్థాయిలో పెట్టుబడి అందలేదు. ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో చెల్లిస్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత ప్రభుత్వం రైతులందరికీ ఒకేసారి పెట్టుబడి అందించేదని, కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక పెట్టుబడి సాయం చెల్లింపులో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంచుకొస్తున్న
ఖరీఫ్ సీజన్...
గత ప్రభుత్వం రైతుబంధు పేరిట పథకం అమలు చేయగా, కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పేరుతో ముందుకు సాగుతోంది. ఏడాది కాలం సాగు సాయం ఇవ్వకుండా పంట చేతిక వచ్చాక పథకం అమలు చేయడం రైతులను అసంతృప్తికి గురిచేస్తోంది. అది కూడా ఒకేసారి కాకుండా ఎకరం, రెండెకరాలు చొప్పున ఇస్తోంది. ఎకరానికి డబ్బులు జమ చేసేందుకు మొదట్లో వారం రోజుల సమయం పట్టగా.. ఇప్పుడు మరింత సమయం పడుతోంది. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. ఒకేసారి పథకం అమలు చేయాలని కోరుతున్నారు.
రెండు, మూడు విడతలపై అనుమానం?
యాసంగి పంటల పెట్టుబడి సాయంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా విడతలవారీగా సాయం చే యడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి సీజన్ రైతుభరోసా డబ్బులను తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కేవలం ఎకరానికే రూ.6 వేల చొప్పున మార్చి 22న రైతులందరి ఖాతాల్లో జమ చేశారు. మిగతావి రెండు, మూడు విడతల్లో చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. వ్యవసాయం మంత్రి మాత్రం పూర్తిగా చెల్లించామని ప్రకటిచారు. దీంతో యాసంగి సాయం చెల్లింపుపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావిస్తున్నారు.
అందరికీ వస్తుంది..
జిల్లాలోని రైతులందరికీ రైతు భరోసా వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతీ రైతు ఖాతాలో ఎకరాకు సంబంధించి రూ.6 వేలు జమ చేసింది. మిగతా వాటిని త్వరలో వేసే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో రెండో విడత డబ్బులు జమవుతాయి. రైతులందరికీ పెట్టుబడి సాయం అందుతుంది.
– అంజిప్రసాద్, డీఏవో


