కొనుగోలు కేంద్రం కోసం రోడ్డెక్కిన రైతులు | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రం కోసం రోడ్డెక్కిన రైతులు

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

● కనకాపూర్‌ జాతీయ రహదారిపై ఆందోళన

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

లక్ష్మణచాంద: మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మండల రైతులు గురువారం రోడ్డెక్కారు. మండలంలోని వివిధ గ్రామాల్లో యాసంగిలో అన్నదాతలు సాగుచేసిన మొక్కజొన్న పంట చేతికివచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులకు తక్కువ ధరకు విక్రయించి రైతులు నష్టపోతున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు కనకాపూర్‌ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు వచ్చి తమకు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనతో నిర్మల్‌ – మంచిర్యాల రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణి కనకాపూర్‌ చేరుకుని రైతులతో మాట్లాడారు. సోన్‌ సీఐ గోవర్ధన్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్సై గోపితో సీఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తహిసీ ల్దార్‌ సరిత, మండల వ్యవసాయ అధికారి వసంత్‌రావు కనకాపూర్‌ చేరుకున్నారు. రైతులతో తహసీ ల్దార్‌ సరిత, ఏవో వసంతరావు మాట్లాడారు. లక్ష్మ ణచాందలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పా టు చేయాలని ఆదేశాలు వచ్చాయని, పీచర, చా మన్‌పల్లి, వడ్యాల్‌లో సబ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

కొనుగోలు కేంద్రాలను విస్తరించాలి

భైంసా: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మరింత విస్తరించాలని మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరా రు. హైదరాబాద్‌లో మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌రెడ్డిని గురువారం కలిసి రైతుల తరఫున వినతిపత్రాన్ని ఇచ్చారు. ముధోల్‌ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు గ్రామాల్లోనూ సబ్‌ సెంటర్లను ప్రారంభించాలని కోరారు. ఈ విషయంపై మార్క్‌ఫెడ్‌ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే సబ్‌సెంటర్లు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.

అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ నియోజకవర్గంలో అన్ని మండలాలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నిర్మల్‌, సారంగాపూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటంతో కొత్తగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి గతంలో లేఖ కూడా రాసినట్లు తెలిపారు. పంట దిగుబడి మేరకు ఇంకా అవసరమైన ప్రాంతాల్లో మిగతా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సంబంధిత శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీతో మాట్లాడినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement