నిర్మల్‌చైన్‌గేట్: పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంటుతో జూన్ 2లోపు పీఆర్సీ అమలు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్ వెల్మల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ పెన్షన్ భవనంలో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నెలకు రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకు పోతున్నాయన్నారు. ఏక మొత్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.13 వేల కోట్లు వెంటనే విడుదలచేసి పెన్షనర్స్ కుటుంబాలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. కొత్త ఈహెచ్‌ఎస్ స్కీం విధివిధానాలు రూపొందించి, మే 1వ తేదీ నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ స్కీం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ఉద్యమ బాధ్యులు ఎంసీ.లింగన్న, సెక్రటరీ జనరల్ డాక్టర్ పీజీ.రెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు నల్ల బ్యాడ్జీలతో నిరసన..
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మండల, డివిజన్, జిల్లాస్థాయి కార్యాలయాల వద్ద ఉద్యోగుల ప్రధాన నాలుగు డిమాండ్లతోపాటు ఉద్యోగుల 64 డిమాండ్లు దశల వారీగా పరిష్కరించాలని శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాలని టీజీ ఈజేఏసీ చైర్మన్ వెల్మల ప్రభాకర్ తెలిపారు. ప్రతీ ఉద్యోగి తమ దగ్గరలోని మండల, డివిజన్, జిల్లా కార్యాలయాలకు భోజన విరామ సమయంలో చేరుకోవాలని సూచంచారు. కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వచ్చి నిరసనలో పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమ ముందస్తు అనుమతి కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు.


