నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చిత్తడి నేలలను శాసీ్త్రయంగా గుర్తించి, వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చిత్తడి నేలల అభివృద్ధి ద్వారా పర్యాటక అవకాశాలు పెరిగి, జిల్లాకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని తెలిపారు. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పే ర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ నేలలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా చిత్తడి నేలలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలో వచ్చే వారంపాటు వేడి గాలుల ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలు, ట్రాఫిక్ కూడళ్లు తదితర ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్ తదితర సేవా సంస్థలను భాగస్వాములను చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్‌ను అత్యవసరంగా సిద్ధం చేసి అమలు చేయాలని, ప్రదేశాల వారీగా వాతావరణ పరిస్థితులను భారత వాతావరణ శాఖ వెబ్‌సైట్ ద్వారా నిరంతరం పరిశీలించాలని అధికా రులకు ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, డీహైడ్రేషన్ చికిత్సకు అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
మొబైల్ నంబర్ల నవీకరణ తప్పనిసరి
రైతుల సంక్షేమానికి మొబైల్ నంబర్ల నవీకరణ ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయశాఖ చేపట్టినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం గ్రామాల వారీగా పట్టాదార్ పాస్‌బుక్‌లను వారి ప్రస్తుత మొబైల్ నంబర్లతో అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎరువుల బుకింగ్ కోసం యాప్ వినియోగం, ప్రభుత్వ రాయితీలు, ఇతర వ్యవసాయ సేవలు పొందేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి అని తెలిపారు. రైతులంతా ఏఈవోలను సంప్రదించి పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు, మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించుకోవాలని సూచించారు. మొబైల్ నంబర్ నమోదు సమయంలో వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయబడుతుందని పేర్కొన్నారు. గతంలో తప్పుగా నమోదైన మొబైల్ నంబర్లను సవరించుకునేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు లేని వారు వెంటనే తమ వివరాలు నమోదు చేసుకోవాలని, మొబైల్ నంబర్ల అప్‌డేటింగ్ ప్రక్రియకు ఏప్రిల్ 20వరకు గడువు ఉందని పేర్కొన్నారు.


