లక్ష్యం 7,684.. తీసుకుంది 300 మందే పరీక్షల నేపథ్యంలో వెనుకంజ అవగాహన కల్పిస్తున్నా ఆసక్తి చూపని బాలికలు
నిర్మల్‌చైన్‌గేట్: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్)క్యాన్సర్‌ను నిరోధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల పంపిణీలో జిల్లా వెనుకంజలో ఉంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14–15 ఏళ్ల మధ్య బాలికలకు టీకాలు వేస్తున్నారు. తొలి విడతలో భాగంగా జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు సీహెచ్‌సీలలో ప్రారంభించారు. రెండో విడతకింద గత నెల 30న జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొదలు పెట్టారు.
జిల్లాలో 7,684 మంది కిశోర బాలికలు..
జిల్లాలో 7,684 మంది కిశోర బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్యక్రమం అంచనా మేరకు విజయవంతం కావడం లేదు. మూడు నెలలపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో నెల రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 300 మంది బాలికలు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రారంభంలో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం పండుగలు, పరీక్షల నేపథ్యంలో వెనుకబడింది. ఇంకా రెండు నెలల్లో 7 వేల మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది.
పరీక్షల నేపథ్యంలో వెనుకంజ..
14–15 ఏళ్ల బాలికల్లో అత్యధికులు ప్రస్తుతం 9, 10వ తరగతులకు చెందినవారే. పది పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి 9వ తరగతి విద్యార్థులకు సైతం పాఠశాలల్లో ఎస్‌ఏ–2 ప్రారంభంకావడంతో పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నేపథ్యంలో టీకా తీసుకుంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు రావొచ్చని చాలా మంది బాలికలు వెనుకంజ వేస్తున్నారు. వైద్యాధికారులు కూడా పాఠశాలలు, కేజీబీవీల్లో అవగాహన కల్పిస్తున్నా స్పందన తక్కువగానే ఉంది.
టీకా ప్రాముఖ్యత ఇదే..
హెచ్‌పీవీ అంటువ్యాధి కారణంగా ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ కణజాలం సహా ఇతర యోనిరహిత కణజాలాల వద్ద క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేస్తుంది. క్యాన్సర్‌ను నివారించేందుకు ఈ టీకా ముందస్తుగా వేస్తారు. వ్యాక్సిన్ వైరస్ రాక ముందే అందించడం వల్ల అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే కేంద్రం 14 నుంచి15 సంవత్సరాల బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకా తీసుకోవచ్చు. హెచ్‌పీవీ టీకా పక్కనే క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే కనుక్కునేందుకు చేసే పాప్ స్మెర్ పరీక్షలు వంటి ఇతర నివారణ చర్యలతో మహిళల ఆరోగ్య రక్షణను బలోపేతం చేస్తుంది.
వ్యాక్సిన్‌తో ఉపయోగాలు..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు నోరు, గొంతు, రొమ్ము క్యాన్సర్లను ఈ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆడపిల్ల ల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకముందే టీకా తీసుకోవడంతో సంబంధిత క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన రోగ నిరోధక శక్తి ఉత్పన్నమవుతుంది. సుమారు రూ.5 వేల ఖరీదు ఉండే ఈ టీకాను భారత ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా పంపిణీ చేస్తోంది.


