నిర్మల్: ‘చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో పురుష పోలీసుల కన్నా మహిళా సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. వారి ఇంటరాగేషన్ చాలా లోతుగా ఉంటుంది. బాధితులకు దగ్గర కావడం, వివరాలు రాబ ట్టడంలో వారిని మించినవారు లేరు. నిర్మల్ జిల్లా మహిళ పోలీసుల పనితీరు భేష్. ఎస్పీ జానకీషర్మిల నేతృత్వంలో ఏడాదిలోనే ఏకంగా జాతీయ స్థాయి ‘స్కోచ్ అవార్డు’ అందుకున్నారు..’ అంటూ పోలీస్ అక్కలతో రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం మాటామంతి నిర్వహించారు. నారీశక్తి, పోలీస్ అక్క, శివంగి తదితర కార్యక్రమాలను ఏడాది కిందట ప్రారంభించామని, వాటి పనితీరు గురించి ఎస్పీ జానకీషర్మిల వివరించారు. కార్యక్రమాల్లో భాగంగా తమ అనుభవాలను మహిళ కానిస్టేబుళ్లు డీజీపీతో పంచుకున్నారు. కేజీబీవీ, గురుకులాల విద్యార్థినులకు గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్, వుమెన్ ట్రాఫి కింగ్‌పై అవగాహన కల్పించామన్నారు. బాసర గో దావరి వద్ద పలువురిని కాపాడినట్లు వివరించారు.
ఏడాదిలోనే జాతీయ అవార్డు..
నిర్మల్ పోలీసుశాఖ పనితీరు బాగుందని, ప్రధానంగా మహిళా పోలీసులు వివిధ కార్యక్రమాల ద్వారా తమ సత్తాను చాటడంతోపాటు ఏడాదికాలంలోనే జాతీయస్థాయి అవార్డును అందుకోవడం పోలీసుశాఖకే గర్వకారణమని డీజీపీ ప్రశంసించారు. పోలీ స్ అక్కలకు స్కోచ్ అవార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బ్లూకోల్ట్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసి విధుల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
భరోసా కేంద్రం ప్రారంభం..
ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు డీజీపీ పేర్కొన్నారు. నిర్మల్‌రూరల్ మండలం ఎల్ల పల్లి సమీపంలో నూతన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. కుటుంబ విభేదాలతో విడిపోయి మళ్లీ కలిసిన జంటలకు ప్రోత్సాహకంగా కానుకలు అందించారు. మహిళలు, బాలలపై నేరాలకు వేగవంతమైన స్పందనతోపాటు, బాధితులకు అన్నివిధాలా సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.


