దేశం గర్వించే మేధావి అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

దేశం గర్వించే మేధావి అంబేడ్కర్‌

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశం గర్వించే మేధావి అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్‌ జయంతి పురస్కరించుకుని పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ సమీపంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలు వివక్షకు గురవుతున్న కాలంలో, సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఉన్నత విద్యను అభ్యసించి, దేశానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని ప్రశంసించారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. అనంతరం జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కలెక్టర్‌ అధికారులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి దయానంద్‌, సీపీవో జీవరత్నం, డీఈవో భోజన్న, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement