● జిల్లాకేంద్రంలో పెరుగుతున్న ఇబ్బంది
నిర్మల్: రెడ్ సిగ్నల్.. కళ్లెదుటే ఎర్రగా కనిపిస్తున్నా.. కనీసం ఆపకుండా అలాగే దూసుకెళ్తున్నారు. ఎదురుగా వాహనాలు వస్తున్నా.. తప్పించుకుంటూ వాటి మధ్యలో నుంచే ప్రమాదకరంగా సిగ్నల్ పంజ్ చేస్తున్నారు. దీంతో కనీసం రోజుకో ప్రమాదం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఇరువర్గాల మధ్య గొడవలకూ దారితీస్తున్నాయి. ఇది జిల్లాకేంద్రంలోని వాహనదారుల పరిస్థితి. చాలా చౌరస్తాల్లో సిగ్నల్స్ పేరుకే అన్నట్లుగా మారిపోయాయి. మరోవైపు.. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. ఉదయం, సాయంత్ర వేళల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పండుగల సమయాల్లో బస్టాండ్, పాతబస్టాండ్ ఏరియాల్లో గంటలపాటు ఇబ్బందులు తప్పడం లేదు. వీటితోపాటు ఓవర్‌స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్‌డ్రైవ్, సైలెన్సర్లు మార్చి నడిపే వారి సంఖ్యా పెరుగుతోంది. ఇవన్నీ రోడ్డుప్రమాదాలకు దారితీస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట పడాలంటే జిల్లాకేంద్రంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఉండాలన్న డిమాండ్ పెరుగుతోంది. ‘అరైవ్.. అలైవ్..’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకు వస్తున్న రాష్ట్ర పోలీస్‌బాస్, డీజీపీ శివధర్‌రెడ్డి పలు సమస్యలతో పాటు కొత్త ఠాణాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
చూసేదెవరు.. ఆపేదెవరు?
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఏమవుతుంది..!? సిగ్నల్ జంప్ చేస్తే ఎవరేమంటారు..!? ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎవరు ఆపుతారు..!? ఈ ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో సమాధానాలు లేవు. ఎందుకంటే.. జిల్లాలో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు విభాగం లేదు. సున్నిత ప్రాంతాలు ఎక్కువగా ఉండే జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సిబ్బందిలో నుంచే ట్రాఫిక్‌కు ప్రత్యేకంగా కేటాయించడం లేదని అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు..
ప్రత్యేక ఠాణా ఉంటేనే..
నిర్మల్‌తోపాటు ఏర్పడ్డ పలు ఇతర జిల్లాకేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్లు, లేనిచోట ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. జిల్లాకేంద్రంలో కూడా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలారోజులుగా ఉంది. జిల్లా పోలీసు అధికారులు సైతం గతంలో ప్రతిపాదనలను పంపించారు. ఈనేపథ్యంలో జిల్లాకు వస్తున్న పోలీస్‌బాస్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా చూడాలని నిర్మల్‌వాసులు కోరుతున్నారు.
ప్రధానంగా జిల్లాకేంద్రంలో శివాజీచౌక్ నుంచి డాక్టర్స్ లైన్ వరకు, మరోవైపు మంజులాపూర్, ఇంకోవైపు కొండాపూర్ వరకు వాహనాలు పెరగడంతోపాటు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. ప్రధానంగా శివాజీచౌక్, ఈద్‌గాం, బస్‌డిపో దక్షిణముఖ ఆంజనేయ ఆలయం, ఆర్డీవో ఆఫీస్, జయశంకర్‌సార్ చౌరస్తా, వివేకానంద చౌక్, బస్టాండ్, అంబేద్కర్‌చౌరస్తా వాహనాలు ఇష్టారీతిన వెళ్తున్నాయి. నాలుగుచోట్ల సిగ్నల్స్ ఉన్నా.. చాలామంది వాటిని పట్టించుకోకుండానే వెళ్తూ ప్రమాదాలకూ కారణమవుతున్నారు.


