రెసిడెన్షియల్ విధానం
ఉపాధ్యాయులు అందుబాటులో ఉండడం
స్ట్రెస్ లెస్ స్టడీస్
విద్యార్థుల డౌట్లను వెంటనే నివృత్తి చేయడం
ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించడం
ప్రతీరోజు మోటివేషనల్ క్లాసులు నిర్వహించడం
కోకరికులం యాక్టివిటీస్ నిర్వహించడం
నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కస్తూరిబాగాంధీ విద్యాలయాల విద్యార్థినులు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 83.6 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో ఏకంగా 96.8 శాతం మంది పాసయ్యారు. జిల్లాలోని 16 మండల కేంద్రాల్లోని కేజీబీవీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు నిర్వహించారు. 12 చోట్ల ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన బోధన, రెసిడెన్షియల్ వసతి, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈసారి అద్భుత ఫలితాలు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు.
మెరిసిన గ్రామీణ బాలికలు
ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా కేజీబీవీ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 936 మంది పరీక్షలు రాయగా, 783 మంది(83.6%) ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్‌లో 660 మంది విద్యార్థులకు గాను 639 మంది (96.8%) పాసయ్యారు. మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం ఏటా పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలకు చెందిన బాలికలే ఈ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు. వారికి కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ వసతి, పాఠ్యపుస్తకాలు, భోజనం, కాస్మెటిక్ వస్తువులు అందిస్తున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు పరీక్షల్లో రాణించడం విశేషం.
ఆరు కాలేజీల్లో 100 శాతం..
జిల్లాలోని ఆరు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్ట్ ఇయర్‌లో నర్సాపూర్, లోకేశ్వరం కేజీబీవీలు శత శాతం ఉత్తీర్ణత సాధించాయి. సెకండ్ ఇయర్‌లో దస్తురాబాద్, దిలావర్‌పూర్, కడెం, మామడ కేజీబీవీల్లో చదువుకున్న విద్యార్థినులందరూ ఉత్తీర్ణులయ్యారు.
జిల్లా విద్యార్థినులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు..
నర్సాపూర్ కేజీబీవీలో చదువుకున్న కీర్తన బైపీసీ సెకండ్ ఇయర్‌లో 988 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. ఫస్ట్ ఇయర్‌లో నిర్మల్ అర్బన్ కేజీబీవీకి చెందిన లాస్య ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో 496 మార్కులు సాధించింది. అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని కీర్తన 494 మార్కులు సాధించింది. వీరిద్దరూ రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు అధ్యాపకులు తెలిపారు. వీరే కాకుండా, ప్రతీ కళాశాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు. గ్రామీణ నేపథ్యం ఉన్న బాలికలు ఇలా రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం జిల్లాకే గర్వకారణం.
ఉత్తమ ప్రతిభకు కారణాలు..
కేజీబీవీల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి పలు కారణాలు ఉన్నాయి.


