వచ్చే ఎన్నికలు 33 శాతం రిజర్వేషన్లతోనే.. రాష్ట్రంలో ఒంటరిగానే అధికారంలోకి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
చట్టసభల్లో మహిళలకు
నిర్మల్‌చైన్‌గేట్: రాబోయే పార్లమెంటు ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్‘ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ఒక చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ చట్టం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని తెలిపారు. 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని వివరించారు. త్వరలో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాయన్నారు. 2014కు ముందు ప్రభుత్వాలు స్కాములు తప్ప స్కీములు అమలు చేయలేదన్నారు. 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో స్కీములు తప్ప స్కాములు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు అభివృద్ధి ఏమీ చేయడం లేదని ఆరోపించారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ తెలంగాణను పూర్తిగా దోచుకుందని, కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో పాలన చేస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు తెలంగాణప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల సమస్యపై పోరాటం చేయాలని సూచించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ‘‘ఏకాత్మ మానవతావాద సిద్ధాంతం మనకు మార్గదర్శకమన్నారు. వ్యక్తి నుంచి సమాజం, సమాజం నుంచి దేశం వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ప్రతీ కార్యకర్త పని చేయాలని సూచించారు. అదే భావనతో బూత్‌స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో అనుబంధాన్ని పెంపొందించడం, సేవాభావంతో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం అవసరమన్నారు. కార్యక్రమాల్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ఇన్‌చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, మేడిసెమ్మే రాజు, కుమ్మరి వెంకటేశ్ జిల్లా, పట్టణ, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు


