ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తా | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తా

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

● ఖానాపూర్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తొలిసారి మహిళకు అవకాశం దక్కింది. 50 రోజుల తర్వాత పాలకవర్గం కొలువుదీరింది. అనూహ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పాలకవర్గం ఏర్పాటు చేశాయి. చైర్‌పర్సన్‌గా 9వ వార్డు కౌన్సిలర్‌ అంకం మౌనికను ఎన్నుకున్నారు. సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. ప్రజలు, పార్టీల సహకారంతో ఖానాపూర్‌కు ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తానని తెలిపారు.

సాక్షి : మేడం కంగ్రాట్స్‌.. తొలి చైర్‌పర్సన్‌గా ఎలా అవకాశం వచ్చింది?

చైర్‌పర్సన్‌ : ధన్యవాదాలు.. నేను 15 ఏళ్ల క్రితం బీజేపీలో చేరాను. నా భర్త మహేందర్‌ ప్రోత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. ప్రజాసమస్యలపై పోరాటాలు చేశా. దీనిని గుర్తించిన అధిష్టానం నాకు ఈసారి కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం కల్పించింది. 9వ వార్డు నుంచి పోటీచేశా. ప్రజలు ఆదరించి గెలిపించారు. అనూహ్యంగా నాకు చైర్‌పర్సన్‌ అవకాశం రావడం గొప్ప గౌరవం. ఇది పట్టణ ప్రజల విజయం,

సాక్షి : మీ విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం?

చైర్‌పర్సన్‌ : నేను బీఎస్సీ ఎంపీసీ చదివాను. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయంగా కుటుంబం నుంచి నాకు మద్దతు ఉంది. అందుకే రాజకీయాల్లో రాణిస్తున్నా. నా భర్త 2019 మున్సిపల్‌ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి పోటీచేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఖానాపూర్‌ నియోజవర్గ కన్వీనర్‌గా ఉన్నారు. ఈసారి నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ప్రోత్సాహం, ప్రజల ఆదరణతో గెలిచాను.

సాక్షి : చైర్‌సర్సన్‌గా మీ ప్రాధాన్యతలు ఏమిటి?

చైర్‌పర్సన్‌ : ఖానాపూర్‌ పట్టణాన్ని ఉత్తమ ుున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా. తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరిస్తా. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తా. ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పిస్తాం. మెరుగైన విద్య, వైద్యం అందేలా చూస్తా.

సాక్షి : పట్టణ అభివృద్ధికి మీ ప్రణాళిక ఏమిటి?

చైర్‌పర్సన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తాం. పాలకవర్గ సభ్యులు, ప్రజలు, మేధావుల సూచనలు, సలహాలు స్వీకరిస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అన్ని పార్టీలను కలుపుకుని పనిచేస్తాం. పట్టణాభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు స్వీకరిస్తాం.

సాక్షి : పట్టణంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమిటి?

చైర్‌పర్సన్‌ : పట్టణంలో కోతులు, కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తొలి సమావేశంలోనే ఈ సమస్య పరిష్కారంపై చర్చిస్తాం. సభ్యుల సూచనల తర్వాత తరలించే కార్యక్రమం చేపడతాం. ప్రధాన సమస్యగా మారిన రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల సహాయం తీసుకుంటాం. బొడ్డోని కుంటలో డ్రెయినేజీ నీరు కలుస్తుంది. మురుగు నీరు చేరకుండా చూస్తాం. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తాం.

సాక్షి : డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తారా?

చైర్‌పర్సన్‌ : ఈ సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. గతంలోను తాము అర్హుల పక్షాన ఆందోళనలు చేశాం. అనర్హులను తొలగించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. డబుల్‌ బెడ్‌రూం కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తాను. అనర్హులను తొలగించిన వెంటనే అర్హులైన వారికి పట్టాలు ఇస్తాం.

సాక్షి : నూతన మున్సిపల్‌ భవనం నిర్మించే ఆలోచన ఉందా?

చైర్‌పర్సన్‌ : మున్సిపల్‌ కార్యాలయం పరిధిలో సుమారు 80 మంది వరకు అధికారులు, సిబ్బంది ఉన్నారు. కార్యాలయం ఇరుకుగా ఉండడంతో ప్రతీరోజు కార్యాలయానికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. పాలకవర్గ సభ్యులతో చర్చించి నూతన మున్సిపల్‌ భవన నిర్మాణం చేపడతాం. సిబ్బంది కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.

సాక్షి : తాగునీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

చైర్‌పర్సన్‌ : రూ.22 కోట్ల కేంద్ర నిధులతో జరుగుతున్న అమృత్‌–2 పథకం పనులు త్వరగా పూర్తి చేయిస్తాం. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూస్తాం.

సాక్షి : శివారు కాలనీల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటారు?

చైర్‌పర్సన్‌ : శివారు కాలనీలు అయిన గాంధీనగర్‌, అంబేద్కర్‌ నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వాగుపై వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాం. అలాగే ప్రధాన రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటాం. డ్రెయినేజీలు నిర్మిస్తాం. తాగునీరు అందేలా చూస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement