గంగపుత్రులు.. ప్రాణదాతలు | - | Sakshi
Sakshi News home page

గంగపుత్రులు.. ప్రాణదాతలు

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

బాసర గోదావరిలో కానరాని ప్రమాద నివారణ చర్యలు నదిలో మునుగుతున్న భక్తులు.. కొందరు ఆత్మహత్యా యత్నం... కాపాడుతున్న జాలర్లు

బాసర: బాసర గోదావరి వద్ద భక్తుల భద్రత కోసం దేవస్థానం, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పవిత్ర గోదావరి నదిలో ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా శనివారం వరంగల్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు పుణ్యస్నానం చేస్తుండగా నీటిలో మునిగిపోయారు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్థానిక గంగపుత్రుడు డప్పు నరేష్‌ చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరినీ ప్రాణాపాయం నుంచి కాపాడారు.

గంగపుత్రుల సాహసం..

వరంగల్‌ జిల్లా నుంచి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం బాసర వచ్చిన ఇద్దరు భక్తులు, గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లిపోయారు. వెంటనే గమనించిన స్థానిక జాలరి తన ప్రాణాలను పణంగా పెట్టి నీటిలో దూకి, ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నీటి ప్రవాహం, లోతు గురించి పూర్తి అవగాహన ఉన్న గంగపుత్రులు లేకపోతే, ఈ ప్రమాదం విషాదంగా మారేదని స్థానికులు అంటున్నారు.

ఆత్మహత్యాయత్నం

అడ్డుకున్న పోలీసులు..

ఇక శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అశ్విని అనే మహిళ, తన ముగ్గురు కుమారులతో కలిసి నదిలోకి దూకేందుకు ప్రయత్నిం చేసిది. అప్రమత్తమైన పోలీసులు వారిని కాపాడారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు, నది ఒడ్డున అదనపు భద్రతా సిబ్బంది అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.

ఉపాధి లేని గంగపుత్రులు

గతంలో గోదావరిలో నాటుపడవలు నడుపుతూ గంగపుత్రులు ఉపాధి పొందేవారు. నది ఒడ్డునుంచి మధ్యలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులను చేర్చడం వీరి ప్రధాన వృత్తి. అయితే, రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు నాటు పడవ ప్రమాదంలో మృతిచెందడంతో, అధికారులు పడవలను పూర్తిగా నిషేధించారు. దీంతో గంగపుత్రుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం కొందరు చేపలు పట్టుకుంటూ, నది గట్టు వెంబడి తిరుగుతూ కష్టంగా జీవనం సాగిస్తున్నారు.

నదీ ప్రవాహం వారికే ఎరుక..

స్థానిక గంగపుత్రులు గోదావరిని నమ్ముకున్నా రు. నది ప్రవాహ ఉధృతి, ఎత్తు పల్లాలు, లోతు, సుడుల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంది. దీంతో నదిలో ఎవరైనా మునిగిపోయినప్పుడు అందుబాటులో ఉన్నవారు సత్వరం స్పందిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు పోలీ సులు కూడా స్థానిక గంగపుత్రులను పిలిపించి గాలిస్తున్నారు. ‘మాకు నది నీటి ప్రవాహం బాగా తెలుసు. అందుకే వరంగల్‌ యువకులను కాపాడగలిగాం. కానీ, మా కుటుంబాల పోషణకు మాత్రం ఏమీ లేదు‘ అని గంగపుత్రుడు డప్పు నరేశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తమను లైఫ్‌గార్డులుగా నియమించి ఉపాధి కల్పిస్తే భక్తుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేస్తామంటున్నాడు. పర్యాటక బోటింగ్‌ సిబ్బందిగా అవకాశం ఇస్తే, భక్తుల ప్రాణాలు కూడా కాపాడుతామని, తమకూ ఉపాధి దొరుకుతుందని గంగపుత్రులు వేడుకుంటున్నారు.

పడవల నిషేధంతో..

గోదావరి నదిలో పడవలు నడపడాన్ని రెండేళ్ల క్రితం నిషేధించారు. దీంతో 60 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని స్థితికి చేరుకున్నాం. గోదావరి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమ్మల్ని దేవాదాయ శాఖ లైఫ్‌గార్డులుగా నియమించి ఉపాధి కల్పించాలి. దీంతో భక్తుల ప్రాణాలకు మేము రక్షణగా ఉంటాం. పర్యాటక బోటు నడిపి ఉద్యోగాలు ఇవ్వాలి.

– సాయినాథ్‌, గంగపుత్రుడు

చేపలు పడుతూ ఉపాధి..

మేము ముందుగా గోదావరిలో నాటు పడవలు నడిపి జీవనం సాగించేవాళ్లం. కానీ ప్రమాదాల కారణంగా ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఇప్పుడు చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నాం. మేము ఎప్పుడూ నది దగ్గరే ఉండడం వల్ల, ఎవరైనా ప్రమాదంలో పడితే వెంటనే గమనించి కాపాడగలుగుతున్నాం. ఈరోజు వరంగల్‌ నుంచి వచ్చిన ఇద్దరు యువకులను ప్రాణాలతో కాపాడాం. సరైన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పడవలు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలి.

– డప్పు నరేశ్‌, గంగపుత్రుడు

Advertisement
 
Advertisement
Advertisement