కాకతీయ యూనివర్సిటీ ఇప్పటికీ కాకమ్మ కథలు చెబుతోంది.. అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ నిర్మల్‌లో పీజీకాలేజీ కొనసాగుతోందని చెబుతోంది. కాకతీయ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల(పీజీ సెంటర్) అక్టోబర్ 1991లో స్థాపించబడింది. ఈ కళాశాల సోషియాలజీలో ఎం.ఫిల్‌తోపాటు ఇంగ్లిష్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, పీజీ డీసీఏ సబ్జెక్టులలో పీజీ కోర్సులు అందిస్తున్నట్లు ఇందులో పేర్కొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ మ్యూజియంను బలోపేతం చేయడానికి ఐటీడీఏ, డీఆర్డీఏ, జిల్లా సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపింది. విశాలమైన కళాశాల భవనంలో తరగతి గదులు, రెండు సెమినార్ హాళ్లు, లైబ్రరీ, కంప్యూటర్ ప్రయోగశాల ఉన్నట్లు పేర్కొనడం విడ్డూరం. ప్రత్యేక భవనంలో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నట్లు తెలుపడం మరింత హాస్యాస్పదం. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నవన్నీ.. ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు భవనం తప్ప.. ఏవీ లేవు. ఆ భవనాన్ని నర్సింగ్ కాలేజీకి ఇచ్చారు. ఇక నిర్మల్ పేరు మీద కొనసాగుతున్న పీజీ కోర్సులకు ఎక్కడ క్లాసులు చెబుతున్నారో ‘కాకతీయ’కే తెలియాలి.


