లక్ష్మణచాంద: మండల కేంద్రంలో పించన్‌దారుల డబ్బులను బీపీఎం కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మణచాంద బీపీఎం బొందలపాటి ప్రసాద్ మార్చి నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు చెల్లించేందుకు గత నెల 28 నుంచి పింఛన్‌దారుల నుంచి ఐరిష్ తీసుకున్నాడు. కానీ ఇందులో కొందరికి మాత్రం డబ్బులు ఇచ్చి మరి కొందరికి ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు ఇస్తానని దాటవేస్తున్నాడని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
బయటకు తెలియడంతో...
గురువారం పోస్టాపీస్ వద్దకు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తమ పింఛన్ డబ్బులు చెల్లించాలని ఆందోళన చేశారు. విషయం సర్పంచ్ కవితకు తెలియడంతో ఆమె పోస్టాపీస్ వద్దకు చేరుకుని బీపీఎంను నిలదీశారు. దీంతో అసలు నిజం బయటపడింది. వెంటనే ఆమె నిర్మల్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ వద్దకు బీపీఎం పింఛన్ డబ్బులు కాజేసిన విషయమై ఫిర్యాదు చేశారు.దీంతో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టాపీస్ సందీప్ లక్ష్మణచాందకు చేరుకున్నారు. ఆయన పింఛన్‌దారులు, గ్రామస్తులతో మాట్లాడారు. పోస్టాఫీస్‌లో ఉండాల్సిన డబ్బులు రూ.3 లక్షలు ఆఫీస్‌లో లేవన్నారు. అలాగే పింఛన్‌దారుల ఐరిష్ తీసుకుని డబ్బులు చెల్లించనట్లుగా తెలిసిందన్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
లేక్కతేలని డబ్బులు...
లక్ష్మణచాందలో మొత్తం 1,518 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో 1,353 మంది ఐరిష్ తీసుకుని డబ్బులు చెల్లించినట్లుగా ఉంది. 165 మంది పింఛన్ తీసుకోనట్టుగా ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. దీంతో ఇందులో ఎంత మందికి డబ్బులు చెల్లించాడో ఎన్ని డబ్బులు కాజేశాడో సరైన సమాచారం లేదు. ఆఫీస్ డబ్బులు రూ.3 లక్షలు, 80 మందికి చెందిన పింఛన్ డబ్బులు రూ.1.60 లక్షలతోపాటు సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించిన డబ్బులు ఎన్ని కాజేశాడో తెలియడం లేదు.


