నిర్మల్‌చైన్‌గేట్: ఎన్ని చట్టాలు తెచ్చినా సాదాబైనామా సమస్య ఇన్నాళ్లు అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఎట్టకేలకు దీనికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఇటీవల జీవో 76 విడుదల చేసింది. తెల్ల కాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన భూముల క్రమబద్ధీకరణ సాఫీగా జరగనుంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 9,620 దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. దీంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
భూభారతిలోనూ సమస్య
రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల కోసం సెక్షన్ 6, రూల్ 6లో నిబంధనలు పొందుపరిచింది. దీని ప్రకారం ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి భూమి చుట్టుపక్కల రైతులతోనూ మాట్లాడి రాతపూర్వక ఆధారాలు పరిశీలించాలి. పీవోటీ, సీలింగ్, ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన జరగలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొనుగోలుదారుడు, అమ్మకందారుడి అఫిడవిట్లు ఇవ్వాలన్న నిబంధనతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ కారణంగా భూభారతి చట్టంలోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు.
అఫిడవిట్ ఒకరు ఇస్తే చాలు
భూముల క్రమబద్ధీకరణకు 2014, జూన్ 2కు పూర్వం తెల్లకాగితాలపై భూములు కొనుగోలు చేసినవారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వాలు మారినా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో భూమి అమ్మేందుకు, పంట రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం గత నెల 18న జీవో 76 విడుదల చేసింది. ఈ జీవో ద్వారా కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించనున్నారు.
అభ్యంతరాలు రాకుంటేనే సర్టిఫికెట్
జీవో 76 ప్రకారం భూమి కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తోపాటు భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలిస్తారు. అఫిడవిట్ అందించిన తర్వాత 30 రోజులు దరఖాస్తులను పెండింగ్ పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే సదరు రైతుకు సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే సర్టిఫికెట్ రద్దు చేస్తారు. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వెనక్కి ఇవ్వరు. అలాగే, జీవో 77 ప్రకారం సాదా బైనామాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకునేనాటికి గ్రామీణ ప్రాంతమై ఉండి, ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిపోయినా వాటిని పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది.
మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు
మండలం దరఖాస్తుల సంఖ్య
బాసర 66
భైంసా 214
దస్తురాబాద్ 849
దిలావర్‌పూర్ 667
కడెం పెద్దూర్ 1,012
ఖానాపూర్ 386
కుభీర్ 648
కుంటాల 341
లక్ష్మణచాంద 664
లోకేశ్వరం 824
మామడ 1,113
ముధోల్ 755
నర్సాపూర్(జి) 332
నిర్మల్‌అర్బన్ 48
నిర్మల్‌రూరల్ 576
పెంబి 73
సారంగపూర్ 647
సోన్ 338
తానూర్ 67
మొత్తం 9,620
ఎలా చేస్తారంటే..?
సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీవోల నేతృత్వంలో జరుగుతుంది. 2014 జూన్ 2 కన్నా ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి 12 ఏళ్లు అనుభవంలో ఉన్నట్లు చూపాలి. 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 మధ్య అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్డీవో క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన రైతుల నుంచి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత హక్కుల రికార్డులో నమోదు చేసి కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారు.


